‘గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్’గా హైదరాబాద్
- ప్రపంచ స్థాయి సమస్యలకు పరిష్కారాలు కనుగొనే ‘ఎకో సిస్టమ్’
- గ్లోబల్ కంపెనీల అవసరాలకు అనుగుణంగా అడ్వాన్డ్స్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
- ‘బ్యాక్ బేస్’ డెవలెప్‌మెంట్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(Global Capability Centers) గమ్యస్థానంగానే కాకుండా... హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి సమస్యలకు పరిష్కారాలు కనుగొనే ‘గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్’గా తీర్చిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister for Industries Duddilla Sridhar Babu) పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్ అవసరాలు, సవాళ్లు, భవిష్యత్ సాంకేతిక మార్పులకు అనుగుణంగా దిగ్గజ కంపెనీలను ఆకర్షించే కాంప్రహెన్సివ్ ఎకోసిస్టంను రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.
హైటెక్ సిటీలో 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన నెదర్లాండ్స్ గ్లోబల్ ఫిన్‌టెక్ దిగ్గజం ‘బ్యాక్ బేస్’ డెవలెప్‌మెంట్ సెంటర్‌ను శుక్రవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అనతికాలంలోనే టెక్నాలజీ, డిజిటల్ బ్యాంకింగ్, ఫిన్ టెక్ రంగాల్లో హైదరాబాద్‌ను గ్లోబల్ కంపెనీలకు ఒక ప్రముఖ గమ్యస్థానంగా తీర్చిదిద్దామన్నారు. బ్యాక్ బేస్ లాంటి దిగ్గజ కంపెనీల విస్తరణే ఇందుకు నిదర్శనమన్నారు.
కేవలం పెట్టుబడులను ఆకర్షించడం, పెద్ద కంపెనీలను రప్పించడమే కాకుండా... డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్, సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ అండ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి రంగాల్లో ఉపాధి అవకాశాలను దక్కించుకునేలా తెలంగాణ యువతను సంసిద్ధం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు.
గ్లోబల్ కంపెనీల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ను అందుబాటులోకి తెచ్చేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలు చూపే సత్తా టెక్నాలజీకి ఉందని, ఆ దిశగా కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకొచ్చే వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు నెకట్స్ జనరేషన్ డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్, సాఫ్ట్ వేర్ ఉత్పత్తులను అందించడంలో ఈ బ్యాక్ బేస్ డెవలప్మెంట్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ కొత్తగా 300 మంది హై-స్కిల్ వర్క్ ఫోర్స్‌కు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో నెదర్లాండ్స్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ యాన్ క్రెమర్స్, బ్యాక్ బేస్ సీటీఓ గ్రెగ్ ఫాహి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ రీన్‌హార్డ్ షీల్, ఇండియా సైట్ హెడ్ సురభి శర్మ తదితరులు పాల్గొన్నారు.