మంచిరేవుల ఫారెస్ట్ పార్కులో మచ్చుకైనా లేని సౌకర్యాలు!

22-10-2026 | 05:20am
  1. నెలకు లక్షల్లో ఆదాయం వస్తున్నా అధికారుల నిర్లక్ష్యం...
  2. పిచ్చి మొక్కలు, విషపురుగులు, వీధి కుక్కల బెడదతో వాకర్స్ బేజారు..
  3. n పార్కును వదిలి సైకిల్ ట్రాక్ బాట పట్టిన ప్రజలు...
  4. మూడు రోజుల్లో సమస్యలు తీర్చకుంటే ధర్నా: బీజేపీ హెచ్చరిక..

రాజేంద్ర నగర్ అక్టోబర్ 21(విజయ క్రాంతి): మంచిరేవుల ఫారెస్ట్ పార్కు నిర్వహణలో అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. ప్రతి నెలా విజిటర్స్, వాకర్స్ నుండి ఎంట్రీ ఫీజుల  రూపంలో లక్షలాది రూపాయల ఆదాయం సమకూరుతున్నప్పటికీ, కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. అధికారుల ఉదాసీన వైఖరిపై మార్నింగ్ వాకర్స్, స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

భయాందోళనలో వాకర్స్

పార్కులోని ప్రసిద్ధ మర్రిచెట్టు ముందు, వెనుక భాగాల్లో ఉన్న వాకింగ్ ట్రాక్ల ఇరువైపులా పిచ్చి మొక్కలు, గడ్డి విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొదల్లా మారి, విషపురుగులు, పాములకు నిలయంగా మారింది. ఉదయాన్నే నడకకు వచ్చే వారు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారు.

దీనికి తోడు పార్కులో పెద్ద ఎత్తున వీధి కుక్కలు చేరిపోవడంతో వాకర్స్తో పాటు, చిన్న పిల్లలపై కూడా దాడికి దిగుతున్నాయి. ఈ దుస్థితి కారణంగా వేలాది రూపాయలు పెట్టి ఏడాది, అర్ధ సంవత్సరం పాసులు తీసుకున్న వారు సైతం పార్కుకు రావడమే మానేశారు. ప్రత్యామ్నాయంగా సమీపంలోని సైక్లింగ్ ట్ప్రా ఉదయపు నడకను కొనసాగించాల్సి వస్తోందని వాకర్స్ వాపోతున్నారు.

మూగజీవాలకూ తప్పని తిప్పలు

తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, పార్కులోని అడవి జంతువులు, పక్షుల దాహార్తిని తీర్చేందుకు కనీసం నీటి తొట్లను కూడా అధికారులు ఏర్పాటు చేయలేదు. పచ్చదనాన్ని కాపాడుతూ, జీవరాశులను సంరక్షించాల్సిన ఫారెస్ట్ అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రకృతి ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మూడు రోజుల్లో సౌకర్యాలు కల్పించకుంటే ధర్నా: బోడే మహేష్ యాదవ్

మంచిరేవుల ఫారెస్ట్ పార్కులో నెలకొన్న దుస్థితిపై బండ్లగూడ జాగీర్ బీజేపీ అధ్యక్షుడు బోడే మహేష్ యాదవ్ అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.. ‘లక్షల్లో ఆదాయాన్ని అర్జిస్తున్న అధికారులు వాకర్స్ భద్రతను,

సౌకర్యాలను గాలికొదిలేశారు. ఇప్పటికైనా అధికారులు తమ నిర్లక్ష్యాన్ని వీడాలి. రాబోయే 3 రోజుల్లో పార్కులో పిచ్చి మొక్కలను తొలగించి, వీధి కుక్కల బెడదను అరికట్టి కనీస సౌకర్యాలు మెరుగుపరచాలి. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పార్కు ముందు పెద్ద ఎత్తున ధర్నా, ఆందోళన కార్యక్రమాలు చేపడతాం‘ అని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు