నెల్లికుదురు బస్టాండ్‌లో సమస్యల తిష్ట!
ప్రయాణికులకు ఇక్కట్లు
నెల్లికుదురు, అక్టోబర్ 21 (విజయక్రాం తి): ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాల్సిన బస్టాండు సమస్యలకు నిలయంగా మారింది. నిత్యం వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులతో సందడిగా ఉండాల్సిన నెల్లికుదురు బస్టాండ్ లో కనీస మౌలిక వసతులు కరువవడం ఆందోళన కలిగిస్తోంది.
ఫ్యాన్లు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రం, తొర్రూరు డివిజన్ కేంద్రంతోపాటు కేసముద్రం మండలాలకు ఇతర ప్రాంతాలకు ఇక్కడ నుండి నిత్యం వందలాది మంది ప్రయాణం సాగిస్తుంటారు.
వసతుల లేమితో అవస్థలు పడుతూ బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులకు ఎండ, ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించే ఫ్యాన్లు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. దాహం తీర్చుకునేందుకు తాగునీటి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు బయట దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు ప్రయాణ సమయంలో మరింత ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర అవసరాల కోసం మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడం ప్రయాణికులకు అసౌకర్యంగా పరిణమించింది. మరుగుదొడ్లను ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణ సరిగా లేక పిచ్చి మొక్కలతో నిండి వినియోగానికి అనుకూలంగా లేకుండా పోయింది. విద్యుత్ సదుపాయం సైతం లేకపోవడం బస్టాండు నిర్వహణలోని లోపాలను ఎత్తిచూపుతోంది.
పట్టించుకునే వారేరీ?
ప్రజా రవాణాలో కీలకమైన బస్టాండ్లలో ప్రయాణికులకు కనీస సదుపాయాలు కల్పించడం సంబంధిత అధికారుల బాధ్యత. అయితే నెల్లికుదురు బస్టాండ్లో నెలకొన్న సమస్యలు ప్రయాణికుల సహనానికి పరీక్షగా మారుతున్నాయి. బస్సుల కోసం వేచి ఉండే సమయంలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు పట్టించుకునే నాథుడే కరువయ్యాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సంబంధిత ఆర్టీసీ, స్థానిక అధికారులు స్పందించి బస్టాండ్లో ఫ్యాన్లు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యాలను తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రజాధనంతో నడిచే రవాణా వ్యవస్థలో ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, సమస్యలను పరిష్కరించి నెల్లికుదురు బస్టాండ్ను ప్రయాణికులకు అనుకూలంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సౌకర్యాలు కల్పించకపోతే ఆందోళన చేపడుతాం
నెల్లికుదురు బస్టాండులో ప్రయాణికులకు తక్షణం సౌకర్యాలు కల్పించాలి. విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి. తాగునీటి వసతి కల్పించి, వినియోగంలోకి మరుగుదొడ్లను తేవాలి. బస్టాండుకు నేమ్ బోర్డు ఏర్పాటు చేసి, బస్సుల రాకపోకల వివరాలను ప్రదర్శించాలి. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండులో సౌకర్యాలు కల్పించకపోతే ప్రజల సహకారంతో ఆందోళన నిర్వహిస్తాం.
వరిపళ్లి అనిల్ కుమార్, బీఆర్‌ఎస్ నాయకుడు, నెల్లికుదురు