ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఢిల్లీ పెద్దల ఫోకస్

19-11-2026 | 12:13pm

సొంత ప్రభుత్వంపైనే సమరశంఖం.. ముఖ్యమంత్రిపైనే విమర్శల బాణాలు.. అయినా పార్టీ నుంచి చర్యలు శూన్యం! మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరును లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల దృష్టికి చేరడంతో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. అసలు ఏం జరిగింది? ఎమ్మెల్యే ఏం మాట్లాడారు? పార్టీ క్రమశిక్షణ (Party Discipline) ఉల్లంఘించారా? అనే అంశాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని అధిష్టానం తెలంగాణ పీసీసీ నాయకత్వాన్ని ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మునుగోడు వేదికగా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు తెరలేపాయి. సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించడంతో ఈ వ్యవహారాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్ ఆదేశాలతో టీపీసీసీ నేతలు ఆయన ప్రసంగానికి సంబంధించిన పూర్తి వీడియో క్లిప్పింగ్‌లు, వ్యాఖ్యల సారాంశాన్ని ఢిల్లీ పెద్దలకు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం తదుపరి అడుగులపై ఆసక్తి నెలకొంది.

రాజగోపాల్ రెడ్డికి పార్టీ నాయకత్వం నుంచి హెచ్చరికలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు పార్టీ వైఖరికి భిన్నంగా బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విధానాలతో పాటు పార్టీ అగ్రనాయకత్వంపైనా విమర్శలు గుప్పించారు. అప్పట్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు (Show Cause Notices) జారీ చేసినా ఆయన స్పందించలేదన్న ప్రచారం ఉంది. అయినప్పటికీ ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇప్పుడు మళ్లీ అదే తరహా పరిస్థితి ఎదురుకావడంతో కాంగ్రెస్‌లో ఓ ప్రశ్న వినిపిస్తోంది. గతంలో నోటీసులనే పట్టించుకోని నాయకుడికి ఇప్పుడు వీడియోలు పంపితే మాత్రం ఏం మారుతుంది? అధిష్టానం నిజంగానే చర్యలు తీసుకుంటుందా? లేక ఈ వ్యవహారం కూడా కొద్దిరోజుల రాజకీయ హడావుడిగానే మిగిలిపోతుందా? పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనలను సహించేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సహా పలువురు నేతలు పలుమార్లు స్పష్టం చేశారు. కానీ కీలక నాయకుల విషయంలో ఆ హెచ్చరికలు ఎంతవరకు అమలవుతున్నాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవైపు పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడుతూనే, మరోవైపు బహిరంగంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలు చేస్తున్న నేతలపై చర్యలు లేకపోవడం కార్యకర్తల్లోనూ చర్చకు దారితీస్తోంది.

నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరులకు ఉన్న రాజకీయ ప్రాబల్యం ఈ వ్యవహారంలో కీలక అంశంగా మారింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రభావం, జిల్లాలో వారి రాజకీయ పట్టును దృష్టిలో పెట్టుకుని అధిష్టానం ఆచితూచి వ్యవహరించే అవకాశముందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్టీకి అవసరమైన నాయకుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఢిల్లీకి వీడియోలు చేరడం, పీసీసీ నుంచి వివరణలు కోరడం వంటి పరిణామాలతో కాంగ్రెస్‌లో రాజకీయ వేడి పెరిగింది. అయితే ఇవన్నీ కేవలం నివేదికల సేకరణకే పరిమితమవుతాయా? లేక రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం గట్టి హెచ్చరికలు జారీ చేస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. గత అనుభవాలను బట్టి చూస్తే కొద్దిరోజుల హడావుడి తర్వాత వ్యవహారం చల్లబడుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో మొదలైన రచ్చ ఇప్పుడు ఢిల్లీ గడప తొక్కింది. వీడియోలు వెళ్లాయి.. నివేదికలు సిద్ధమవుతున్నాయి.. కానీ చర్యల మాటకొస్తేనే అసలు సస్పెన్స్ మొదలైంది. కాంగ్రెస్‌లో క్రమశిక్షణ (Congress High Command) అందరికీ ఒకటేనా? లేక రాజకీయ బలాన్ని బట్టి మారుతుందా? ఈ ప్రశ్నలకు అధిష్టానం తీసుకునే నిర్ణయమే సమాధానం చెప్పనుంది!

మరిన్ని వార్తలు