సొంతోడు మొదలుపెట్టాడు.. ప్రతిపక్షోడు కొనసాగించాడు

19-11-2026 | 12:58pm

ఒకవైపు సొంత పార్టీ ఎమ్మెల్యే అసంతృప్తి.. మరోవైపు ప్రతిపక్ష ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు.. తెలంగాణ రాజకీయాల్లో నిధుల పంచాయితీ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది! కాంగ్రెస్ ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు పలకడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఎం అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల నియోజకవర్గాలకే నిధులు కేటాయిస్తూ.. మిగతా ప్రాంతాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారులను సంప్రదించాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుతం నిధుల కోసం మున్సిపల్ కమిషనర్, వాటర్ వర్క్స్ ఎండీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని రాజాసింగ్ మండిపడ్డారు. ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. అభివృద్ధి పనుల కోసం అధికారుల ముందు చేతులు చాచాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, నిధుల విషయంలో, అధికారులతో సమన్వయంలో ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని పేర్కొన్నారు. ఇప్పుడు కనీసం ఎమ్మెల్యేల ఫోన్లకు కూడా అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు.

రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల్లో గోషామహల్ నిధుల అంశం ప్రత్యేకంగా నిలిచింది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో గోషామహల్ నుంచి పన్నులు, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లుల రూపంలో ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం వస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాంటప్పుడు అదే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. ఆదాయం ప్రభుత్వానికి వెళ్తుంటే.. అభివృద్ధి పనులు మాత్రం ఎందుకు ముందుకు సాగడం లేదని నిలదీశారు.

నిధుల కేటాయింపులో నిజంగా వివక్ష ఉందా లేదా అన్నది తేల్చాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే సమగ్ర సర్వే చేయించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఏ నియోజకవర్గం నుంచి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తోంది? తిరిగి అక్కడ ఎంత నిధులు ఖర్చు చేస్తున్నారు? అనే వివరాలను బహిరంగపరచాలని సవాల్ విసిరారు. అప్పుడే ప్రభుత్వ నిధుల పంపిణీలో పారదర్శకత ఉందో లేదో ప్రజలకు తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

గోషామహల్‌లో రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు, డ్రైనేజీ సమస్యలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని రాజాసింగ్ ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్లు చేసినా, మెసేజ్‌లు పంపినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేలు అధికారులను సంప్రదించలేని పరిస్థితి ఉంటే ఇక ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి వ్యవస్థ కొనసాగుతోందని కూడా ఆరోపణలు గుప్పించారు.

ఇప్పటికే సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ తీరుపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో చర్చకు దారితీశాయి. ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అదే తరహా విమర్శలు చేయడంతో రాజకీయంగా ఈ అంశానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రతి నియోజకవర్గానికి సమానంగా అభివృద్ధి నిధులు కేటాయించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఒక ప్రాంతానికి ప్రాధాన్యత ఇచ్చి, మరో ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తే చివరకు నష్టం ప్రభుత్వానికే జరుగుతుందని హెచ్చరించారు.

మొత్తానికి.. రాజగోపాల్ రెడ్డి రేపిన నిధుల చర్చకు రాజాసింగ్ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా అదే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. నిధుల కేటాయింపులో నిజంగానే వివక్ష ఉందా? అధికారుల తీరు మారుతుందా? గోషామహల్ అభివృద్ధికి నిధులు వస్తాయా? అన్న ప్రశ్నలకు రేవంత్ సర్కారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది!

మరిన్ని వార్తలు