నిలువ నీడేది!
ఏడుపాయలలో కనిపించని చలువ పందిళ్లు
ఎండకు క్యూలో నిల్చుని అవస్థలు పడుతున్న భక్తులు
కోట్లలో ఆదాయం.. వసతులు శూన్యం
పాపన్నపేట, సెప్టెంబర్ 29: దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయం(Durga Bhavani temple), రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా(Medak District) పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం(Edupayalu Vana Durga Bhavani temple). ఏడాది పొడవునా భక్తులతో రద్దీగా ఉండే పుణ్యక్షేత్రం. ఏటా కోట్లలో ఆదాయం వస్తున్నా భక్తులకు సరిపడా వసతులు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. భక్తులకు వసతులు(Facilities for devotees) కల్పించ డంలో అధికార యంత్రాంగం విఫలమైంది.
ఆదివారాలు ఇతర సెలవు రోజుల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు జిల్లాలు ప్రధానంగా జంట నగరాల నుంచి పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సైతం వేలాది భక్తులు ఏడుపాయల వనదుర్గామాత దర్శనానికి తరలి వస్తారు. అమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయం చెంత నిలువ నీడ లేక పోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలైన్‌లో వేచి ఉండే భక్తులకు కాళ్ల కింద సీసీ, పైన ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు.
పాదాలు బొబ్బలెక్కుతున్నాయని భక్తులు వాపోతున్నారు. కొద్దిపాటి ఆదాయం ఉన్న ఆలయాల్లో చలువ పందిల్లు ఏర్పాటు చేస్తుంటే రూ.కోట్లలో ఆదాయం ఉన్న ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో మాత్రం అధికారులు భక్తులకు నిలువ నీడ కల్పించలేకపోతున్నారు. వర్షాకాలంలో సైతం భక్తులకు అవస్థలు తప్పడం లేదు. ప్రత్యేక దర్శనం, ధర్మ దర్శనంతో పాటు రాజగోపురం నుంచి అమ్మవారి ప్రధాన ఆలయం వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది.
అంతేకాకుండా లడ్డు, పులిహోర ప్రసాదం తింటూ కూర్చుందాం అన్నా ఎక్కడ నిలువ నీడ లేదు. వనదుర్గమ్మ చెంత కొద్దిసేపు సేద తీరేందుకు అనువైన స్థలం లేకపోవడంతో భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి ప్రధాన ఆలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ విషయమై దేవస్థానం కార్యనిర్వాణాధికారి వీరేశంను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
సౌకర్యాలు లేవు..
సమయం దొరికినప్పుడల్లా ఏడుపాయల వనదుర్గామాతను కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకుంటాం. ఎప్పుడు వచ్చినా ఏదో రకంగా ఇబ్బందులు పడుతూనే ఉంటాం. ఎండ ఎక్కువగా ఉండటంతోపాటు కింద సీసీ ఉండటంతో క్యూలో చాలా ఇబ్బంది పడ్డాం. నీడ ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుంది. ప్రతి వస్తువుపై దుకాణదారులు డబ్బులు అదనంగా దోచుకుంటున్నారు. అధికారులు, పాలకులు దృష్టి సారించాలి.
దుర్గేష్, భక్తుడు, హైదరాబాద్