ఉప్పొంగిన ఇంద్రావతి
- 53 ఏళ్ల రికార్డు బద్దలు
- రాజస్థాన్‌లో వడగళ్ల వాన, యూపీలో పెరిగిన చలి
- హిమాచల్‌లో విరిగిపడ్డ కొండచరియలు
- ఉత్తరకాశీలో చిక్కుకున్న పర్వతారోహకులను కాపాడిన రెస్క్యూ బృందాలు
రాయ్‌పూర్, సెప్టెంబర్ 29: ఛత్తీస్‌గఢ్‌లో(Chhattisgarh) భారీ వర్షాలతో(Heavy rains) ఇంద్రావతి నది(Indravati River) ఉప్పొంగి ప్రవహిస్తుంది. 53 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టింది. మంగళవారం చిత్రావతి నది 12.39 మీటర్ల ఎత్తున ప్రవహిస్తూ 1973 నాటి 12.18 మీటర్ల రికార్డును వెనక్కు నెట్టింది. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు బోట్లు, హెలికాప్టర్ల ద్వారా 833 మందిని రక్షించారు. నీటిమట్టం పెరుగుతుండడంతో తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి 65 సహాయక శిబిరాల్లో 8,894 మందికి ఆశ్రయం కల్పించారు. మరోవైపు రాజస్థాన్‌లోని జైపూర్, బికనీర్, చురులో వడగళ్ల వాన కురుస్తుంది.
రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. అటు ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాంపూర్, బదౌన్‌లలో దట్టమైన పొగమంచు కమ్ముకొని చలితీవ్రత పెరిగింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో జాంగ్లిఖ్ వంతెన సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో హిమపాతంలో చిక్కుకుపోయిన పర్యాటకులను రెస్క్యూ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఇదిలా ఉండగా మిగతా ప్రాంతాల నుంచి అర్నాబ్ తుపాను వల్ల ఏర్పడిన గాలులు, రుతుపవనాలు దేశం నుంచి ఉపసంహరించుకోవడం ప్రారంభించినట్లు ఐఎండీ అధికారులు తెలిపారు.