భయంతోనే విష ప్రచారం

30-09-2026 | 05:05am
  1. హిందూ సమాజంపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు క్షమించరాని నేరం 
  2. రాముడు, శివుడిని వేరుచేస్తూ రేవంతుద్దీన్ ప్రేలాపనలు
  3. ఈసీ సాకుతో దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఇండి కూటమి కుట్రలు 
  4. సీఎం విద్వేష వ్యాఖ్యలకు వ్యతిరేకంగాగా నేడు బీజేపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు
  5. చేరికల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ఎన్నికల్లో(election) ఓటమి తప్పదని తెలిసినప్పుడల్లా రాజ్యాంగబద్ధ సంస్థలను(Constitutional body) బద్నాం చేయడం కాంగ్రెస్ కు అలవాటుగా మరిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాం చందర్‌రావు(N Ram Chandra Rao) విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల(Vote bank politics) కోసం హిందూ సమాజంపై(Hindu society) విషం కక్కడం క్షమించరాని నేరంగా పేర్కొన్నారు. యావత్ హిందూ సమాజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం విద్వేషపూరిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బుధవారం తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చేరికల అనంతరం ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత ఎన్నికల ప్రక్రియను  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వంటి నేతలే ప్రశంసిస్తున్నారని, కాంగ్రెస్ మాత్రం పనిగట్టుకుని మన ఎన్నికల వ్యవస్థను ప్రపంచ వేదికలపై కించపరిచేలా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. సర్ ప్రక్రియపై ‘ఇండి’ కూటమి పార్టీలు కావాలనే తప్పుగా ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన, దొంగ ఓట్ల తొలగింపు, అసలైన ఓటర్లకు న్యాయం చేయడమే సర్ లక్ష్యమని తెలిపారు.

2018లో తెలంగాణ, రాజస్థాన్‌లో ఓట్ల తొలగింపుపై అభిషేక్ మను సింఘ్వీ, సచిన్ పైలట్, పశ్చిమబెంగాల్లో జవహర్ సిర్కార్ వంటి కాంగ్రెస్, కూటమి నేతలే వేలాది దొంగ ఓట్లు ఉన్నాయన్నారని గుర్తు చేశారు. కేరళం ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు రమేష్ చెన్నితాల సైతం సర్ ప్రక్రియ వల్లే తమకు ప్రయోజనం కలిగిందని అంగీకరించారని తెలిపారు. గెలిస్తే వ్యవస్థలు మంచివని, ఓడిపోతే ఈవీఎంలు, సర్ బూటకమని మాట్లాడటం కాంగ్రెస్ నైజమని విమర్శించారు.

ఈసీఐ న్యూట్రాలిటీపై తప్పుడు ప్రచారం

ఎన్నికల సంఘం సభ్యుల మధ్య విభేదాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ పనిగట్టుకుని చేస్తున్న ప్రచారాన్ని రాంచందర్ రావు తిప్పికొట్టారు. ఈసీఐ సభ్యుల మధ్య ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని, ఇప్పటికే సీఈసీ జ్ఞానేశ్‌కుమార్, కమిషనర్లు సుఖ్‌బీర్‌సింగ్ సంధు, వివేక్ జోషి స్పష్టం చేశారని తెలిపారు. ఫామ్-6 వ్యాలిడిటీని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని చెప్పారు. గతంలో నెహ్రూ, ఇందిరా గాంధీల హయాంలోనే సుకుమార్ సేన్, కల్యాణ్ సుందరం, ఎస్పీ సేన్‌వర్మ, నాగేంద్ర సింగ్, టి. స్వామినాథన్, ఆర్‌కె త్రివేది వంటి కమిషనర్లకు పదవీ విరమణ తర్వాత పదవులు, పద్మ పురస్కారాలు ఇచ్చి రాజ్యాంగ వ్యవస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీయేనని మండిపడ్డారు. 

హిందూ దేవుళ్లను విభజిస్తున్న రేవంత్ రెడ్డి..

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ దేవుళ్లను వాడుకుంటూ, సమాజాన్ని నిలువునా చీల్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బరితెగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘శివుడు పేదల దేవుడు.. రాముడు ధనవంతుల దేవుడు’ అని అభ్యంతరకరంగా వర్గీకరించడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. భూముల అమ్మకాలు, ల్యాండ్ల దందాలతో వేల కోట్లు వెనకేసుకుంటున్న రేవంత్ రెడ్డికి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి? ఆయనకు ఎలాంటి కష్టాలూ లేవు కాబట్టే దేవుళ్లపై ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖైరతాబాద్ ఉప ఎన్నిక కోసమే..

రాజీవ్ మల్హోత్రా రచించిన ‘బ్రేకింగ్ ఇండియా’ పుస్తకంలో పేర్కొన్నట్లుగానే కాంగ్రెస్ అధిష్ఠానం దేశాన్ని, మతాలను విచ్ఛిన్నం చేసే విధానాలను అమలు చేస్తోందని రాంచందర్‌రావు ఆరోపించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు నెలవారీ ముడుపులు పంపిస్తూ, వారి కనుసన్నల్లోనే రేవంత్ రెడ్డి ఈ విద్వేష ప్రచారానికి ఒడిగడుతున్నారని విమర్శించారు. గతంలో స్వయంగా ‘ముస్లిం ఈజ్ కాంగ్రెస్.. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం’ అని బహిరంగంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు కల్మాలు చదువుకుంటూ పూర్తిగా రేవంతుద్దీన్‌గా మారిపోయారని మండిపడ్డారు.

ఉత్తర బేధాలు, కులాల చిచ్చులు పెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు ఏకంగా హిందూ దేవుళ్ల మధ్య వైషమ్యాలు రగిల్చే స్థాయికి దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశ విదేశాల్లోని కోట్ల మంది హిందువుల మనోభావాలను గాయపరచడమేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ శివారులోని పవిత్ర క్షేత్రం కీసరగుట్టలో స్వయంగా శ్రీరాముడే శివలింగాన్ని ప్రతిష్ఠించి శ్రీరామలింగేశ్వరస్వామిగా నిలిచారని, దక్షిణ భారతదేశంలోని రామేశ్వరంలో శ్రీరాముడు పూజించిన లింగమే నేడు శివాలయంగా భాసిల్లుతోందన్నారు.

త్వరలో జరగనున్న ఖైరతాబాద్ ఉపఎన్నికలో ముస్లిం ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టేందుకే రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై విషం చిమ్ముతున్నారని రాంచందర్ రావు ఆరోపించారు. దేవుళ్లపై నమ్మకం లేని, హిందూ సమాజాన్ని అవమానించే నాయకుల ఫ్లెక్సీలను ఇకపై ఏ దేవాలయాల ముందూ పెట్టనిచ్చేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో అంతకుముందు డాక్టర్ ప్రీతి శర్మ, డాక్టర్ సుభాష్, డాక్టర్ రణ్వీర్ సింగ్,డాక్టర్ జీవిత రవిపాటి, డాక్టర్ పమేలా, డాక్టర్ శ్రీరామ్, డాక్టర్ శ్రీ నగేష్, డాక్టర్ హనుమంతరావు తదితరులు బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని రాంచందర్ రావు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి. సుభాష్, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు