తమ్మిడికుంటకు పూర్వవైభవం

11-11-2026 | 05:15am
  1. మాదాపూర్ శిల్పారామం ఎదుట కనువిందు చేయనున్న ప్రకృతి సోయగం 
  2. రూ.౨౦కోట్లతో సుందరీకరణ, అలరించనున్న రోజ్ గార్డెన్ 
  3. నేడు లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీ బ్యూరో/శేరిలింగంపల్లి, నవంబర్ 10 (విజయక్రాంతి): ఐటీ కారిడార్(IT Corridor) గుండెకాయ లాంటి మాదాపూర్ శిల్పారామం ఎదురుగా ఉన్న తమ్మిడికుంట చెరువు పునరుజ్జీవం(Tammidikunta Lake Restoration) పోసుకుంది. దశాబ్దాలుగా ఆక్రమణల పాలై కుంచించుకుపోయిన ఈ చెరువును హైడ్రా ప్రత్యేక చొరవతో రూ.20 కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది.

పునరుద్ధరణ పనులన్నీ పూర్తి కావడంతో బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఒకప్పుడు దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తమ్మిడికుంట, ఆక్రమణల కారణంగా 14 ఎకరాలకు పరిమితమైంది. ఎన్ కన్వెన్షన్‌తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడంతో తిరిగి 16 ఎకరాల భూమి చెరువు పరిధిలోకి వచ్చింది. ప్రస్తుతం రూ.20 కోట్లతో చేపట్టిన సుందరీకరణ పనుల్లో భాగంగా 

వాకింగ్ ట్రాక్, రోజ్ గార్డెన్‌ను సుందరంగా తీర్చిదిద్దారు. చెరువు చుట్టూ 1.25 కిలోమీటర్ల పొడవైన వాకింగ్ ట్రాక్ నిర్మించారు. ట్రాక్‌కు ఇరువైపులా పచ్చని మొక్కలు, ల్యాండ్ స్కేపింగ్, సందర్శకుల కోసం ప్రత్యేక బెంచీలు, యోగా వేదిక, గజబోలు, రోజ్ గార్డెన్ అందుబాటులోకి తెచ్చారు. మురుగు నీరు కలవకుండా కేవలం వర్షపు నీరు మాత్రమే చెరువులోకి వచ్చేలా పక్కా డ్రైనేజీ చర్యలు చేపట్టారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి విచ్చేస్తున్న నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్తో కలిసి బహిరంగ సభ వేదిక, విఐపి సీటింగ్, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజల రాకపోకల మార్గాలను సమీక్షించారు. తమ్మిడికుంట పునరుద్ధరణ విజయవంతం కావడంతో రెండో విడత కింద రూ.300 కోట్ల అంచనా వ్యయంతో నగరంలోని మరో 14 చెరువులను అభివృద్ధి చేయడానికి హైడ్రా ప్రణాళికలు సిద్ధం చేసింది. 

మరిన్ని వార్తలు