పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
మహబూబాబాద్: ప్రపంచ బాలల దినోత్సవం(World Childrens Day) సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణం(Mahabubabad town) బాలసదనంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్(Collector Sneha Shabari) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం చిన్నారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, వారికి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం సురక్షితమైన వాతావరణం కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిరోధం(Prevention of Child Marriages) కోసం అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి వేదికలు ఎంతగానో దోహదపడతాయన్నారు.
అనంతరం బాల సదనం పరిధిలోని చిల్డ్రన్స్ కేర్ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం మరియు క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేసి అభినందించారు.
చలికాలం నేపథ్యంలో స్వెటర్స్, కరాటే యూనిఫామ్, అందించారు. చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చిల్డ్రన్స్ కేర్ కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా సమచారం ఇవ్వాలని సంబధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శిరీష, సిడబ్ల్యుసి చైర్పర్సన్ నాగవాణి, బాలల పరిరక్షణ అధికారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు,పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.