పొలం నుంచి మిల్లుకే..!

07-11-2026 | 05:30am
  1. ధాన్యానికి భలే డిమాండ్
  2. మద్దతు ధరకు మించి అమ్మకం
  3. క్వింటాల్‌కు రూ.3,200 నుంచి రూ.3,400 ధర

మహబూబాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): సన్నధాన్యానికి ( selling fine paddy)భలే డిమాండ్ ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల క్రితం వరకు మురసు తుఫాన్(Cyclone Murasu) కారణంగా వర్షాలు కురవడంతో వరి కోతలు వాయిదా పెట్టిన రైతులు ఇప్పుడు వరి కోతలను ముమ్మరం చేశారు. పొలం నుండే నేరుగా యంత్రాల ద్వారా కోత పెట్టిన వరి ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. 17 శాతం తేమ లోపు ఉండి కలిగి సూపర్ ఫైన్ సన్నధాన్యానికి రైస్ మిల్లర్లు క్వింటాలుకు 3,200 నుండి 3,400 రూపాయల ధర పెడుతున్నట్లు చెబుతున్నారు.

తేమ అధికంగా ఉంటే నేరుగా కృత్రిమంగా తేమను తొలగించే డ్రయ్యర్లు ఉన్న బాయిల్ రైస్ మిల్లులకు తీసుకెళ్తున్నారు. 2,700 రూపాయల నుండి 2,750 వరకు క్వింటాలు చొప్పున ధాన్యాన్ని బాయిల్ రైస్ మిల్లర్లు నేరుగా కొనుగోలు చేస్తున్నారు. దీనితో జిల్లావ్యాప్తంగా వరి కోతలు ముమ్మరంగా చేపట్టి నేరుగా బాయిల్ రైస్ మిల్లులకే తరలించేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.

పంట కోత తరువాత ఆరబెట్టడం, కాపలాగా ఉండడం, మార్కెట్ కు తరలించి దిగుమతి చేయడం వల్ల అమ్మకాలు పూర్తి చేయడానికి కొన్ని రోజుల సమయం పడుతుండడంతో రైతులు అంత సమయం వేచి ఉండలేక నేరుగా అధిక ధర కోసం వేచి ఉండకుండా, కొంత ధర తగ్గినప్పటికీ ప్రభుత్వ ‘మద్దతు’ ధర 2,400కు మించి లభిస్తుందడంతో మిల్లులకు తరలించడానికే ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో పలు బాయిల్ రైస్ మిల్లుల వద్ద సన్న ధాన్యం కొనుగోలు నేరుగా సాగిస్తున్నారు.

పొలం నుండి మిల్లుకు నేరుగా తరలించి వెంటనే నగదు పొందుతున్నారు. ప్రభుత్వం ఏడు రకాల సన్నధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలకు 2,400 తో పాటు అదనంగా 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని ప్రకటించగా, మిల్లులో ప్రస్తుతం మద్దతుకు మించి ధర లభిస్తుందడంతో కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లకుండా నేరుగా మిల్లుల్లో విక్రయించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

మరిన్ని వార్తలు