ప్రజల వద్దకే సంక్షేమ ఫలాలు అందిస్తున్న ప్రజా ప్రభుత్వం
అభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదు
షాద్నగర్ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మరమ్మతులకు రూ. 7 కోట్లు మంజూరు
ఫరూక్ నగర్ లో చేయూత పింఛన్ల జాతర
షాద్ నగర్,(విజయక్రాంతి): పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పోటీ పడాలి తప్ప, అడ్డుపడాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(MLA Veerlapalli Shankar) స్పష్టం చేశారు. శుక్రవారం షాద్ నగర్ మున్సిపాలిటీ(Shad Nagar Municipality) పరిధిలోని ఫరూక్నగర్ లో ఏర్పాటు చేసిన 'ఇందిరమ్మ చేయూత' పింఛన్ల పంపిణీ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ వైస్ చైర్మన్ అందేమోహన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
గతంలో పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఆ ఇబ్బందులను తొలగించి నేరుగా ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలకతీతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా కౌన్సిలర్లందరినీ కలుపుకొని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నామని పేర్కొన్నారు.
మహిళలకు పెద్దపీట.. సన్నబియ్యం పంపిణీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తోందని శంకర్ అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గుర్తు చేశారు. పేదలు కడుపునిండా భోజనం చేయాలనే సదుద్దేశంతో రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోందని వివరించారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మోక్షం.. త్వరలో జీవిత బీమా
గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పూర్తికి తాను ఎమ్మెల్యే అయిన వెంటనే రూ. 7 కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. మౌలిక వసతుల కల్పన పూర్తి చేసి త్వరలోనే అర్హులైన పేదలకు వాటిని అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, సొంతిల్లు లేని వారందరూ 'ఇందిరమ్మ ఇళ్ల' పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందిరా గాంధీ జయంతి (నవంబర్ 19) సందర్భంగా పేద కుటుంబాలకు ధీమా కల్పించేందుకు రూ. 5 లక్షల ‘ఇందిరమ్మ జీవిత బీమా’ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుందని ప్రకటించారు.
ప్రతిపక్షాలకు గట్టి హెచ్చరిక
గత పదేళ్ల పాలనకు, ప్రస్తుత ప్రజా పాలనకు ఉన్న తేడాను ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. "మీరు అభివృద్ధిలో మూడు అడుగులు వేస్తే, నేను ఏడు అడుగులు ఎగురుతా" అంటూ ప్రతిపక్ష నాయకులకు సవాల్ విసిరారు. తన మౌనాన్ని బలహీనతగా భావించి అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగునూరు బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్, కమిషనర్ సునీత రెడ్డి, 10వ వార్డు మహిళా కౌన్సిలర్ శ్రావణి 11వ వార్డు మహిళా కౌన్సిలర్ పిల్లి శారద శేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, సింగిల్ విండో చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్, గిరిజన ఆదివాసి కోఆర్డినేటర్ పి. రఘునాయక్, మార్కెట్ డైరెక్టర్ కరుణాకర్, కౌన్సిలర్లు కొప్పునూరు ప్రవీణ్, దిలీప్, శివ, గౌస్ జానీ, తదితరులు పాల్గొన్నారు.