మానుకోటను ముంచెత్తిన వర్షం
- చెరువులు, కుంటలకు జలకళ
- పొంగిన వాగులు, రాకపోకలకు ఆటంకం
- అత్యధికంగా కేసముద్రంలో 216.8 మి.మీ. రికార్డు వర్షపాతం
మహబూబాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో (Mahabubabad District) శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా కేసముద్రంలో 216.8 మిల్లీమీటర్ల వర్షం కురువగా, నెల్లికుదురులో 196.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దంతాలపల్లి, తొర్రూరు, పెద్ద వంగర, నరసింహులపేట తదితర మండలాల్లో కూడా 100 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది.
భారీ వర్షానికి పలు మండలాల్లో కుంటలు, చెరువుల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో జలకళను సంతరించుకున్నాయి. బయ్యారం పెద్ద చెరువు 19.6 అడుగుల నీరు చేరడంతో మత్తడి పోసింది. నెల్లికుదురు, దంతాలపల్లి మండలాల్లో వాగులు పొంగి ప్రవహించడంతో కొద్దిసేపు రాకపోకలు స్తంభించాయి. కేసముద్రం పట్టణంలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా లో వానాకాలంలో సాగుచేసిన పంటలకు భారీ వర్షం కాస్త జీవం పోసిందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.