రేషన్ బియ్యం రూట్ చేంజ్!

10-10-2026 | 05:25am

బ్రాండెడ్ సంచుల్లో సన్న బియ్యం

మహబూబాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): దళారులు రేషన్ బియ్యం అక్రమ రవాణా(Ration Rice Smuggling) రూట్ చేంజ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ప్రభుత్వం పేదలకు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు, రీసైక్లింగ్, లేదంటే నూకలుగా మార్చడం జరిగేదని, దొడ్డు బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడం తోపాటు పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది.

కొంతకాలం వరకు సన్న బియ్యం వినియోగం బాగానే ఉన్నప్పటికీ ఇటీవల మళ్ళీ అక్రమ బియ్యం రవాణా  జోరుగా సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. అనేక సంఘటనల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం పట్టుబడుతుండడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. కొందరు వినియోగదారులు సన్నబియ్యాన్ని నేరుగా దళారులకు విక్రయిస్తుండగా, మరికొందరు రేషన్ షాపుల ద్వారా సేకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

కిలో 20 చొప్పున కొనుగోలు చేసి, సన్నబియ్యాన్ని అక్రమార్కులు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారని ఇప్పటివరకు అంతా బావించారు. అయితే తాజాగా వెలుగు చూసిన కొన్ని సంఘటనలు సన్నబియ్యాన్ని బ్రాండెడ్ సంచుల్లో నింపి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గురువారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో పోలీసులు పట్టుకున్న ఓ సంఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. 

పెరిగిన ధరలతో సన్నబియ్యానికి డిమాండ్

సన్నబియ్యానికి ఇటీవల ధర పెరగడంతో కొందరు అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని బ్రాండెడ్ బియ్యంగా ఏమార్చి విక్రయిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం  మార్కెట్లో బ్రాండెడ్ రకం సన్నబియ్యానికి 70 రూపాయల వరకు కిలో చొప్పున విక్రయిస్తున్నారు. దీనితో కొందరు దళారులు రేషన్ సన్నబియ్యాన్ని 20 రూపాయల చొప్పున కొనుగోలు చేసి బ్రాండెడ్ సంచుల్లో నింపి, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విధంగా కిలోకు 40 రూపాయల వరకు లాభం గడుస్తున్నట్లు చెబుతున్నారు. 

నమ్మకంతో వమ్ము చేస్తున్నారు

రేషన్ బియ్యం లబ్ధిదారుల నుండి, రేషన్ డీలర్ల నుండి కొనుగోలు చేసిన దళారులు వాటిని మళ్లీ రైస్ మిల్లుల్లో పాలిష్ చేసి, బ్రాండెడ్ సంచుల్లో నింపి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కొందరు మిల్లర్లకు దన్నుగా దళారులు నిలుస్తున్నారని, మార్కెట్లో తమకున్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని నమ్మిన వారిని నట్టేట ముంచుతున్నారని ప్రచారం సాగుతోంది.

ప్రభుత్వం సన్న బియ్యం పథకం పెట్టి బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిందని భావిస్తుంటే, పెరిగిన ధరలు, రేషన్ బియ్యం తినని కొందరు అనర్హుల వల్ల మళ్లీ రేషన్ దందా తీవ్ర రూపం దాల్చిందనే విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు