భూ వివాదాలకు చెక్!
- 70 గ్రామాల్లో భూభారతి తొలి దశ సర్వే
- కలెక్టర్ స్నేహ శబరిష్ నిరంతర పర్యవేక్షణ
- నారాయణపురం రోల్ మోడల్
మహబూబాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన ‘భూ భారతి(Bhu Bharati)’ సమగ్ర భూ సర్వే (రీ సర్వే) కార్యక్రమంలో భాగంగా, మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad District) మొదటి విడత కింద 70 గ్రామాల్లోచేపట్టిన రీ సర్వే 11 గ్రా మాల్లో పూర్తి చేయగా మిగిలిన గ్రామాల్లో సర్వే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్(District Collector Sneha Sabarish) నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సర్వే కార్యక్రమాన్ని పర్య వేక్షిస్తూ ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేసి ఈ మొదటి దశ భూ సర్వే పనులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. దశాబ్దాలుగా ఉన్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడం, ప్రతి భూకమతానికి ఖచ్చితమైన సరిహద్దులను నిర్ణయించడం లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నారు. పాత పద్ధతులను పక్కనబెట్టి, ఆధునిక రోవర్లు , డీజీపీఎస్ సాంకేతికతతో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. మొదటి దశ సర్వే పనులన్నింటినీ నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
డీజీపీఎస్ పనితీరు
(డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ఇది మనం సాధారణంగా మొబైల్ ఫోన్లు లేదా కార్లలో ఉపయోగించే సాధారణ GPS సాంకేతికతకు మరింత మెరుగైన మరియు అత్యంత ఖచ్చితమైన రూపం. సాధారణ జీపీఎస్ కేవలం ఉపగ్రహాల ఆధారంగా పనిచేస్తుంది. ఇది చూపించే స్థానంలో సుమారు 5 నుండి 15 మీటర్ల వరకు తేడా (ఎర్రర్) ఉండే అవకాశం ఉంటుంది.
అదే డీ జీ పీ ఎస్ ఈ లోపాలను సరిదిద్ది 1 నుండి 3 సెంటీమీటర్ల అత్యంత సూక్ష్మమైన ఖచ్చితత్వంతో భూమిపై ఉన్న స్థానాన్ని చూపిస్తుం ది. డీ జీ పీ ఎస్ వ్యవస్థ ప్రధానంగా రెండు భా గాల ఆధారంగా పనిచేస్తుంది. బేస్ స్టేషన్ దీనిని భూమిపై ముందే ఖచ్చితంగా కొలిచిన ఒక స్థిరమైన ప్రదేశంలో ఏర్పాటు చేస్తారు. ఇది ఉపగ్రహాల నుంచి వచ్చే సిగ్న ల్స్‌ను అందుకుని, తన అసలు స్థానానికి, ఉపగ్రహం చూపిస్తున్న స్థానానికి మధ్య ఉన్న తేడాను లెక్కిస్తుంది.
రోవర్ పనితీరు
ఇది సర్వే చేసే వ్యక్తి చేతిలో లేదా డ్రోన్‌కు ఉండే మొబైల్ పరికరం. బేస్ స్టేషన్ లెక్కించిన వ్యత్యాసాల సమాచారాన్ని రేడియో సి గ్నల్స్ ద్వారా ఈ రోవర్ అందుకుంటుంది. తద్వారా రోవర్ తాను ఉన్న ఖచ్చితమైన సరిహద్దును సెంటీమీటర్ల తేడాతో రికార్డ్ చేస్తుంది.
భూ సమగ్ర సర్వేలో సరిహద్దు వివాదాలకు చెక్
ఒక రైతు భూమి మరొకరి భూమిలోకి కలవకుండా, ఇంచుల వారీగా ఖచ్చితమైన సరిహద్దు మ్యాప్‌లను తయారు చేయడానికి రీ సర్వే దోహదపడుతుంది.
డిజిటల్ రికార్డులు
ఈ సాంకేతికత ద్వారా సేకరించిన రేఖాంశాలు, అక్షాంశాలను భవిష్యత్తులో ఎవరూ మార్చలేరు. పాత పద్ధతిలో గొలుసులు, టేపులతో నెలల తరబడి చేసే సర్వేను ఈ రోవర్ల ద్వారా కేవలం కొన్ని రోజుల్లోనే పూర్తి చేస్తున్నారు.
గ్రామంలో సర్వే జరిగే ప్రక్రియ
సర్వే బృందం మీ గ్రామానికి వచ్చే ముం దు రైతులకు, భూ యజమానులకు అధికారికంగా నోటీసులు జారీ చేసి, తద్వారా రైతులు తమ భూమి వద్ద అందుబాటులో ఉండేవిధంగా చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయి సర్వే లైసెనస్డ్ సర్వేయర్లు రోవర్ పరికరాల తో నేరుగా పొలాల్లోకి వచ్చి, ప్రస్తుతం సాగు లో ఉన్న హద్దుల ఆధారంగా డిజిటల్ కొలతలు తీసుకుంటున్నారు. రికార్డుల సరిపోలిక రోవర్ ద్వారా వచ్చిన కొత్త కొలతలను, రె వెన్యూ విభాగంలోని పాత పహాణీలు/టిప్పన్లతో (పాత రికార్డులతో) అధికారులు సరిచూస్తున్నారు.
అభ్యంతరాల స్వీకరణ
కొత్త డిజిటల్ ల్యాండ్ పార్సెల్ మ్యాప్ (ఎల్ పీ ఎం) తయారైన తర్వాత, గ్రామ సభ నిర్వహించి లేదా నోటీసుల ద్వారా రైతులకు చూపిస్తున్నారు. హద్దుల్లో ఏవైనా తప్పులు ఉంటే రైతులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు.
భూభారతి పోర్టల్‌లో నమోదు
అభ్యంతరాలన్నీ పరిష్కారం అయిన తర్వాత, సరికొత్త డిజిటల్ నక్షా (మ్యాప్),భూ రికార్డులను అధికారిక భూ భారతి పోర్టల్ లో భద్రపరుస్తారు.
రీ సర్వేకు నారాయణపురం రోల్ మోడల్
భూభారతిలో భూముల రీ సమగ్ర సర్వే ద్వారా దశాబ్దాలుగా నలుగుతున్న భూ వివాదాలు పరిష్కారమవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామం రోల్ మోడల్ గా నిలుస్తోంది. గ్రామంలో దాదాపు 60 ఏళ్లు గా పెండింగ్‌లో ఉన్న భూముల వివాదాన్ని ఈ సర్వే ద్వారా పరిష్కరించి, ఇటీవలే 780 మంది రైతులకు 1,378 ఎకరాలకు సంబంధించిన ఎల్ పీ ఎం, భూధార్‌తో కూడిన పట్టాదారు పాస్‌బుక్‌లను పంపిణీ చేశారు.