కరువు కోరల్లో ఓరుగల్లు..!

29-10-2026 | 05:25am

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 42 మండలాల్లో కరువు 

ఎల్‌నినో తెచ్చిన చేటు

26.7 లోటు వర్షపాతంతో తగ్గిన పంటల సాగు

సాగులో సగానికి పైగా ఎండిన పంటలు 

మహబూబాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ఎల్ నినో(El Nino) ప్రభావం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని 365 మండలాలను రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్టు గుర్తించింది.

మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధిలోని 42 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2026 వానాకాలం సీజన్లో సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 26.7 లోటు వర్షపాతం నమోదయింది. హనుమకొండ జిల్లాలో 49, వరంగల్ లో 48, మహబూబాబాద్ లో 34, జయశంకర్ భూపాలపల్లి లో 23, ములుగులో 19, జనగామలో 45 శాతం లోటు వర్షపాతం నమోదయింది. 

తగ్గిన పంటల సాగు

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాధారణ పంటల సాగు విస్తీర్ణంతో పోలిస్తే ఈ ఏడాది వానాకాలంలో 2,40,201 ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వానకాలం సాధారణ సాగు విస్తీర్ణం 15.93 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 14.16 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. అందులో కూడా పంట చివరి కాలానికి సాగునీరు సరిగా లేక, పంటలు దిగుబడి సగానికి పైగా తగ్గిపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చాలాచోట్ల భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పంటలకు సాగునీరు అందించే పరిస్థితి లేక వరి పంటపై ఆశలు వదులుకున్నారు. మక్కజొన్న, పత్తి పంటల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. కొన్నిచోట్ల మక్కజొన్న పంట కూడా పూర్తిగా ఎండిపోయింది. పత్తి పంట రెండు నుంచి నాలుగు పర్యాయాలు పంట దిగుబడి తీసుకునే పరిస్థితి ఈసారి లేకుండ పోయింది. కేవలం ఒకటి రెండు పర్యాయాలు మాత్రమే పత్తి ఏరుకునే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కరువు ప్రకటనతో రైతుల్లో ఆశలు

ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ సహాయం కోసం రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మహబూబాబాద్, వరంగల్, హనుమకొండతో పాటు ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లాల అధికారులు గ్రామాల వారీగా పంటల పరిస్థితిని పరిశీలించి, నష్టాల వివరాలను పారదర్శకంగా నమోదు చేయాలి. కరువు సాయానికి అర్హులైన రైతుల జాబితాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, పౌరసరఫరాలు, గ్రామీణ నీటి సరఫరా శాఖలు సమన్వయంతో పనిచేయాలి. సహాయక చర్యలపై కలెక్టర్లు క్రమం తప్పకుండా నివేదికలు సమర్పించాలన్న ప్రభుత్వ ఆదేశాల అమలు కూడా కీలకం. కరువు ప్రకటన రైతుకు భరోసాగా మారాలంటే.. సహాయం కాగితాలకే పరిమితం కాకూడదు. నష్టపోయిన రైతును గుర్తించడం నుంచి పరిహారం అందేవరకు ప్రతి దశలో జాప్యాన్ని తగ్గించాలి. సాగు పెట్టుబడులు కోల్పోయిన అన్నదాతకు సకాలంలో చేయూత, గ్రామాల్లో తాగునీటి భద్రత, పశువులకు మేత, కూలీలకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ చర్యల అసలైన ఫలితాన్ని నిర్ణయిస్తాయి. ఉమ్మడి వరంగల్లోని 42 కరువు మండలాల రైతులకు ఆ భరోసా ఎంత త్వరగా అందుతుందన్న ఆశతో ఉన్నారు.

కరువు మండలాలు ఇవే.!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 42 కరువు మండలాల వివరాలు ఇలా ఉన్నాయి. 

మహబూబాబాద్ జిల్లా : డోర్నకల్, కురవి, గూడూర్, నెల్లికుదురు, సీరోల్, కొత్తగూడా, ఇనుగుర్తి.

ములుగు జిల్లా : గోవిందరావుపేట, ఏటూరునాగారం, వెంకటాపురం, మంగపేట. 

హనుమకొండ జిల్లా : వేలేరు, ఎలుకతుర్తి, కమలాపురం, హసన్పర్తి, కాజీపేట, హనుమకొండ, ఐనవోలు, దామెర, ఆత్మకూరు, శాయంపేట, భీమదేవరపల్లి, ధర్మసాగర్, నడికుడ.

వరంగల్ జిల్లా : దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపేట, సంగెం, పర్వతగిరి, నెక్కొండ, ఖిక్కొండ వరంగల్, వరంగల్.

భూపాలపల్లి జిల్లా: మహాదేవపూర్, ముత్తారం, కాటారం, మలహర్రావు, గోరికొత్తపల్లి .

జనగామ జిల్లా: రఘునాథపల్లి, తరిగొప్పుల, జఫర్గడ్, పాలకుర్తి.

మరిన్ని వార్తలు