జడ్పీ హైస్కూల్ స్థలాన్ని ఇంచు కూడా వదులుకునేది లేదు
- పాఠశాల పరిరక్షణకు పూర్వ విద్యార్థుల రౌండ్ టేబుల్ సమావేశం
పాల్వంచ, (విజయక్రాంతి): పాల్వంచ పట్టణంలోని(Palwancha town) జడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(ZPHS Government High School) స్థల పరిరక్షణకు పూర్వ విద్యార్థులు(Alumni) నడుం బిగించారు. పాఠశాల ఆవరణలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వవద్దని, పాఠశాల స్థలాన్ని ఇంచు కూడా వదులుకునేది లేదని స్పష్టం చేశారు. శనివారం పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు రంగారావు విగ్రహం వద్ద పూర్వ విద్యార్థుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పూర్వ విద్యార్థి కొండపల్లి శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు పూర్వ విద్యార్థులు, పట్టణ ప్రముఖులు పాల్గొని పాఠశాల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1963 నుంచి నేటి వరకు వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల్లో ప్రముఖులుగా ఎదిగేందుకు ఈ పాఠశాల పునాదిగా నిలిచిందన్నారు. అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ పాఠశాలను సందర్శించడం దీని ప్రత్యేకతకు నిదర్శనమన్నారు. ప్రస్తుతం కూడా అధిక సంఖ్యలో విద్యార్థులతో, మెరుగైన ఉత్తీర్ణత శాతంతో పాఠశాల కొనసాగుతోందని తెలిపారు.
ఒకప్పుడు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాఠశాల స్థలం ప్రస్తుతం ఐదు ఎకరాలకు పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన స్థలాన్ని పాఠశాల అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పాఠశాలకు తక్షణమే వాచ్‌మెన్‌ను నియమించాలని కోరారు.సమావేశంలో చేసిన తీర్మానాలను సోమవారం జిల్లా కలెక్టర్‌తో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులకు, జిల్లా మంత్రులకు, స్థానిక ఎమ్మెల్యే కు వినతి పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో పూర్వ విద్యార్థులు.. పట్టణ ప్రముఖులు కిలారు నాగేశ్వరరావు, కనగాల బాలకృష్ణ, ఎస్.జె.కె. అహ్మద్, కాల్వ భాస్కర్, బండి వెంకటేశ్వర్లు, ముత్యాల రమణమూర్తి, కనగాల అనంత రాములు, వడ్లమూడి పూర్ణచంద్రరావు, నల్లమల వేణు, దాసరి నాగేశ్వరరావు, ఎం.డి. మసూద్ తదితరులు పాల్గొన్నారు.