దుందుభి వాగులో యథేచ్ఛగా ఇసుక దందా!

19-11-2026 | 05:10am
  1. మైనర్ల చేతుల్లో ట్రాక్టర్ల స్టీరింగ్..
  2. ఉదండాపూర్ పరిసరాల్లో ఫిల్టర్ ఇసుక తయారీ?
  3. అధికారుల పర్యవేక్షణ కరువు
  4. అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటాం: నర్సింగ్ రావు, తహసీల్దార్, జడ్చర్ల 

జడ్చర్ల, నవంబర్ 18 : దుందుభి వాగు అక్రమ ఇసుక రవాణా(Illegal Sand Mining)కు అడ్డగా మారుతోందనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నా యి. జడ్చర్ల, మిడ్జిల్, రాజాపూర్ మండలాల పరిధిలోని దుందుభి వాగు నుంచి అనుమతులకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లు, భారీ వాహనాల ద్వారా తరలిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇసుక రవాణా కొనసాగుతున్నా సంబంధిత శాఖల అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదని స్థానికు లు ప్రశ్నిస్తున్నారు.

మైనర్లతో ట్రాక్టర్ల నడిపింపు

ఇసుక రవాణాలో మరో ఆందోళనకర అంశం వెలుగులోకి వస్తోంది. జడ్చర్ల పట్టణం, పరిసర ప్రాంతాల్లో మైనర్ యువకులతో ఇసుక ట్రాక్టర్లు నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రైవింగ్కు అర్హత లేని మైనర్ల చేతుల్లో భారీ వాహనాల స్టీరింగ్ పెట్టడం వల్ల రోడ్డు ప్రమాదాల ముప్పు పొంచి ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్ యజమానులు, నిర్వాహకులపై రవాణా, పోలీసు శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.

ఉదండాపూర్ పరిసరాల్లో ఫిల్టర్ ఇసుక దందా?

జడ్చర్ల మండలం ఖానాపూర్ గ్రామ పరిసరాల్లో ఫిల్టర్ ఇసుక తయారీ జరుగుతోం దని స్థానికులు ఆరోపిస్తున్నారు. నది ఇసుక పేరుతో నల్లమట్టి, మొరం కలిపి నాణ్యతలేని ఇసుకను తయారు చేసి విక్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి ఇసుకతో నిర్మాణాలు చేపడితే భవనాల నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందని నిర్మాణ రంగానికి చెందిన వారు చెబుతున్నారు. సంబంధిత శాఖల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ వ్యవహారం కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి.. పర్యావరణానికి ముప్పు

అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా వల్ల ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ ఆదాయం కోల్పోవడమే కాకుండా వాగు సహజ స్వరూపం దెబ్బతినే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇసుక తరలింపునకు అనుమతులు ఉన్నాయా? ఎంత పరిమాణంలో తరలిస్తున్నారు? ప్రభుత్వానికి ఎంత రాయల్టీ చెల్లిస్తున్నారు? అనే అంశాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటాం 

 ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపునకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటం. అనుమతులు లేకుండా ఇసుక తరలించడం, అక్రమంగా నిల్వ చేయడం వంటి చర్యలను ఉపేక్షించేది లేదు. మండల పరిధిలో ఎక్కడైనా అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

నర్సింగ్ రావు, తహసీల్దార్, జడ్చర్ల 


మరిన్ని వార్తలు