ఖేలో ఇండియా కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు పరిశీలన
మహబూబ్‌నగర్, (విజయక్రాంతి): 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026లో(Khelo India Youth Games–2026) భాగంగా మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న కబడ్డీ పోటీలకు సంబంధించి గురువారం మెయిన్ స్టేడియం మైదానాన్ని అసిస్టెంట్ కలెక్టర్(Assistant Collector) (అండర్ ట్రైనీ), జిల్లా ఖేలో ఇండియా నోడల్(Khelo India Nodal) అధికారి సాయి శివాని పరిశీలించారు.
ఈ సందర్భంగా క్రీడాకారులకు అవసరమైన వసతులు, క్రీడా మైదానం, గ్రీన్‌రూమ్‌లు, ప్రేక్షకుల సౌకర్యాలు, తాగునీరు, విద్యుత్, పార్కింగ్, మరుగుదొడ్ల ఏర్పాట్లను సమీక్షించారు. పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పోటీల నిర్వహణలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి జె. రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, క్రీడా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.