ప్రజావాణికి 56 దరఖాస్తులు

02-11-2026 | 10:38pm
  1. అధికారులు క్షేత్ర స్థాయిలో త్వరగా పరిష్కరించాలి
  2. కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, (విజయక్రాంతి) : ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, డీఆర్ఓ మోతిరామ్ లతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మందమర్రి మండలం రామకృష్ణాపూర్ కు చెందిన లింగంపల్లి లక్ష్మి తాను, తన భర్త వృద్ధులమని, తను దివ్యాంగురాలు అని, తన భర్త కూలీగా పనిచేసి పోషిస్తున్నాడని, రెండు పడక గదుల ఇల్లు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

కన్నెపల్లి మండలం లింగాల గ్రామానికి చెందిన శివలి జగదీష్ తాను సమాచార హక్కు చట్టం క్రింద అడిగిన సమాచారాన్ని ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మంచిర్యాల పట్టణానికి చెందిన లక్షెట్టి రాజమల్లు తనకు జి.ఓ. నం.59 క్రింద తన ఇంటి క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణంలోని శ్రీశ్రీ నగర్ కు చెందిన జనగామ రాజబాబు తాను జి.ఓ. నం.59 క్రింద దరఖాస్తు చేసుకొని రుసుము కూడా చెల్లించడం జరిగిందని, పట్టా ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన మేకల అక్షయ్ కుమార్ ఎస్.సి., ఎస్.టి. సబ్ ప్లాన్, ఇతర నిధులు సత్వరమే మంజూరు చేసి గ్రామంలోని కాలనీలలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, గ్రామంలో శిథిలావస్థకు చేరిన జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల అభివృద్ధి పనులను తక్షణమే చేపట్టాలని కోరుతూ వేరువేరు దరఖాస్తులు అందజేశారు. మందమర్రి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జగ్గం బొందయ్య తనకు గ్రామ శివారులో గల భూమిలో కొందరు దౌర్జన్యంగా అక్రమంగా ఇల్లు నిర్మించుకుంటూ విక్రయాలకు పాల్పడుతున్నారని, ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ ప్రతినిధులు 3వ సమావేశాన్ని నిర్వహించి అర్హులైన పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో 56 దరఖాస్తులు అందాయని, ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు