షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
రూ.5 లక్షల ఆస్తి నష్టం.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికుల విజ్ఞప్తి
చివ్వెంల, నవంబర్ 24 (విజయక్రాంతి): చివ్వెంల మండలం మొగ్గయ్యగూడెం గ్రామపంచాయతీ(Moggayyagudem Grama Panchayat) పరిధిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ధరావత్ బాబుకు చెందిన నివాస గృహం పూర్తిగా దగ్ధమైంది. ఆటో డ్రైవర్గా పనిచేసే బాబు రోజువారీ పనికి వెళ్లిన సమయంలో మంగళవారం ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఇల్లు, ఇంట్లోని సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇల్లు పూర్తిగా దగ్ధం కావడంతో బాధిత కుటుంబం నిరాశ్రయులై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సంబంధిత అధికారులు ఘటనపై విచారణ జరిపి ఆస్తి నష్టాన్ని అంచనా వేయడంతో పాటు బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా తగిన ఆర్థిక సహాయం, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.