టేకులపల్లిలో వైభవంగా కార్తీక పౌర్ణమి పూజలు

24-11-2026 | 04:33pm

వేకువజామున శివలింగానికి అభిషేకాలు.. సత్యనారాయణ స్వామి వ్రతంతో ఆధ్యాత్మిక శోభ

టేకులపల్లి, నవంబర్ 24 (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి(Karthika Pournami) పర్వదినాన్ని పురస్కరించుకొని టేకులపల్లి మండల కేంద్రంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో తెల్లవారుజామునే భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

వేకువజామున శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి, పుష్పాలతో అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అనంతరం కార్తీక పౌర్ణమి సందర్భంగా లోకకల్యాణం, కుటుంబ సౌభాగ్యం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు.

మంతోజు పవన్ కుమార్ ఆచార్యులు తమ మిత్రబృందంతో కలిసి ఈ పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళహారతులు, భక్తి గీతాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

కార్తీక మాసంలో శివారాధనకు విశేష ప్రాధాన్యత ఉండటంతో భక్తులు తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకొని అభిషేకాలు, దీపారాధనలు నిర్వహించడం విశేషం. కార్తీక పౌర్ణమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజలతో టేకులపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తితో పూజలు నిర్వహించి స్వామివార్ల ఆశీస్సులు పొందారు.

మరిన్ని వార్తలు