అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట
జగిత్యాల, నవంబర్ 24 (విజయక్రాంతి): వేలాది మంది అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఊరట కల్పిస్తూ అసలు అగ్రిగోల్డ్ బాండ్లు, నగదు రసీదుల ధృవీకరణ (Verification) ప్రక్రియను నవంబర్ 25, 2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తెలంగాణ నేర పరిశోధన విభాగం (CID) వెల్లడించింది. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లాకు చెందిన బాధితుల కోసం కరీంనగర్లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
బాధితులకు త్వరితగతిన న్యాయం, ఉపశమనం కల్పించాలనే లక్ష్యంతో నిర్దేశిత కేంద్రాల్లో పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల బాధితుల కోసం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అల్కాపురి కాలనీ, కరీంనగర్-సిరిసిల్ల బైపాస్ రోడ్డు, డీర్ పార్క్ పక్కన, ఎన్టీఆర్ విగ్రహం సమీపంలోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (CTC)లో ప్రత్యేక ధృవీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నవంబర్ 25, 2026 నుంచి ఫిబ్రవరి 2, 2027 వరకు దశలవారీగా మండలాల వారీగా ధృవీకరణ ప్రక్రియ నిర్వహించనున్నారు. ప్రతి పని దినం గరిష్టంగా 250 ఖాతాలను పరిశీలిస్తారు.
జగిత్యాల జిల్లా మండలాల వారీ షెడ్యూల్:
నవంబర్ 25: బీర్పూర్ (246)
నవంబర్ 26: ధర్మపురి (250)
నవంబర్ 27: ధర్మపురి (13), ఎండపల్లి (237)
నవంబర్ 28: ఎండపల్లి (14), గొల్లపల్లి (236)
నవంబర్ 30: గొల్లపల్లి (14), ఇబ్రహీంపట్నం (236)
డిసెంబర్ 1: ఇబ్రహీంపట్నం (12), కథలాపూర్ (238)
డిసెంబర్ 2: కథలాపూర్ (11), కోరుట్ల (239)
డిసెంబర్ 3: కోరుట్ల (8), మల్యాల (242)
డిసెంబర్ 4: మల్యాల (32), మల్లాపూర్ (218)
డిసెంబర్ 5: మల్లాపూర్ (73), మేడిపల్లి (177)
డిసెంబర్ 7: మేడిపల్లి (75), మెట్పల్లి (175)
డిసెంబర్ 8: మెట్పల్లి (97), పెగడపల్లి (153)
డిసెంబర్ 9: పెగడపల్లి (126), సారంగాపూర్ (124)
డిసెంబర్ 10: సారంగాపూర్ (122), వెల్గటూర్ (128)
డిసెంబర్ 11: వెల్గటూర్ (142)
డిపాజిటర్లు తమ మండలానికి కేటాయించిన తేదీని ముందుగా నిర్ధారించుకొని సమీప పోలీస్ స్టేషన్లో వివరాలు తెలియజేయాలని ఎస్పీ సూచించారు. అక్కడి నుంచి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని సీటీసీ కేంద్రానికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
ధృవీకరణకు అవసరమైన పత్రాలు:
డిపాజిటర్లు తమ అసలు బాండ్లను (Original Bonds) కేవలం పరిశీలన కోసం మాత్రమే చూపించాలని, అధికారులకు వాటిని సమర్పించాల్సిన అవసరం లేదని ఎస్పీ స్పష్టం చేశారు.
డిపాజిటర్ జీవించి ఉంటే: అసలు బాండ్ లేదా రసీదుతో పాటు స్వీయ ధృవీకరణ చేసిన కలర్ జిరాక్స్, ఆధార్, పాన్ కార్డు జిరాక్స్, పేరు, ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ స్పష్టంగా ఉన్న బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్, తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబర్ తీసుకురావాలి. ఏజెంట్ వివరాలు తెలిస్తే వాటిని కూడా అందించాలి.
డిపాజిటర్ మరణించి నామినీ జీవించి ఉంటే: నామినీ సంతకం చేసిన బాండ్ కలర్ జిరాక్స్, డిపాజిటర్ మరణ ధృవీకరణ పత్రం, నామినీ ఆధార్, పాన్, రేషన్ కార్డు లేదా కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, ఫోటో, బ్యాంక్ ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబర్ తీసుకురావాలి.
డిపాజిటర్, నామినీ ఇద్దరూ మరణించి ఉంటే: చట్టబద్ధ వారసుడు సంతకం చేసిన బాండ్ కలర్ జిరాక్స్, ఇద్దరి మరణ ధృవీకరణ పత్రాలు (అసలు, జిరాక్స్), వారసుని ఆధార్, పాన్, చట్టబద్ధ వారసుల లేదా కుటుంబ ధృవీకరణ పత్రం (అసలు, జిరాక్స్), బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, ఫోటో, మొబైల్ నంబర్ సమర్పించాలి.
డిపాజిటర్ జీవించి ఉండి స్వయంగా రాలేని పరిస్థితుల్లో: కుటుంబ సభ్యులు డిపాజిటర్ అసలు బాండ్, సంతకం చేసిన కలర్ జిరాక్స్, ఆధార్, పాన్, బ్యాంక్ పాస్‌బుక్, ఫోటోతో పాటు డిపాజిటర్ నుంచి అధీకృత లేఖ (Authorization Letter) తీసుకురావాలి. హాజరయ్యే కుటుంబ సభ్యుని గుర్తింపు పత్రం, కుటుంబ సంబంధాన్ని నిరూపించే ధృవీకరణ పత్రం కూడా సమర్పించాలి.
ఏజెంట్లకు ప్రత్యేక సూచనలు:
ఏజెంట్ల ద్వారా బాండ్లు సమర్పించే వారు ప్రతి అసలు బాండ్‌తో పాటు కలర్ జిరాక్స్ చూపించాలి. ప్రతి బాండ్ గుర్తింపు సంఖ్యను విడివిడిగా నమోదు చేయాలి. తమ ఆధార్, పాన్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, ఫోటో, మొబైల్ నంబర్‌తో పాటు ఏజెంట్ కోడ్ తప్పనిసరిగా సమర్పించాలి. పత్రాల పరిశీలన పూర్తయిన అనంతరం అధికారులు రసీదు (Acknowledgement) అందజేస్తారు. ఏజెంట్ వివరాలు తెలియని పక్షంలో దరఖాస్తు ఫారమ్‌లో 'తెలియదు / అందుబాటులో లేదు' అని పేర్కొనవచ్చని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.