ఎన్హెచ్ఎం రోస్టర్ మౌనం వెనుక మతలబేంటి..?
ధరఖాస్తు చేసుకున్న కేటగిరీలో పోస్టుందో లేదోననే ఆందోళనలో అభ్యర్థులు...
కనీసం అధికారులకైనా ఏ కేటగిరీలో ఏ పోస్టుందో తెలుసా...?
ఎవరిని మభ్యపెట్టేందుకు, ఎవరి లబ్ధీకోసం ఈ దాపరికాలు...
మంచిర్యాల, అక్టోబర్ 19 (విజయక్రాంతి) : ఎన్ హెచ్ఎం నోటిఫికేషన్లో(NHM notifications) 52 పోస్టులకు సంబంధించి రోస్టర్ పై ఇప్పటికీ సంబంధిత శాఖా అధికారులు ప్రకటించకపోవడంలో మతలాబేంటో అర్థం కావడం లేదని ఆయా పోస్టులకు దరఖాస్తు(Application) చేసుకున్న అభ్యర్థులు(Candidates) పేర్కొంటున్నారు. ఎన్ హెచ్ ఎం నోటిఫికేషన్ లో ‘రాత పరీక్షకు 90 మార్కులు’ అని పేర్కొన అది కాస్త ‘విజయక్రాంతి’ పత్రికలో(‘Vijayakraanti’ newspaper) వార్త రావడంతో సంబంధిత అధికారులు ‘రాత పరీక్ష లేదు.. మెరిట్ ప్రకారమే ఎంపిక’ అంటూ ప్రకటించారు. దీంతో ఎంపిక విధానంపై అభ్యర్థుల సందేహం తీరినా, నోటిఫికేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చిన బాధ్యులపై ఏ చర్యలు తీసుకున్నారన్నది మాత్రం ప్రశ్నగానే మిగిలింది.
కనీసం అధికారులకైనా ఏ కేటగిరీలో ఏ పోస్టుందో తెలుసా...?
ఇప్పటికి కేటగిరీల వారీ రిజర్వేషన్ రోస్ట్పన(Reservation Roster) అధికారుల మౌనం ఎవరి లబ్ధికోసమో అర్థం కావడం లేదు. రోస్టర్ విధానంపై సంబంధిత శాఖ అధికారులను కోరినా సిబ్బంది రోస్టర్ ఇవ్వకపోవడంతో అవకతవకలు చోటుచేసుకుంటాయోననే అనుమానాలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి. రోస్టర్ లేకుండానే నోటిఫికేషన్ ఇచ్చారా?.. ఉంటే ఎందుకు దాస్తున్నారు..? ఇదే జిల్లాలో ఆయుష్ నియామకాల్లో కేటగిరీల వారీ ఖాళీలు ప్రకటిస్తున్నప్పుడు ఎన్ హెచ్ ఎంలో ఎందుకు ప్రకటించడం లేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
ధరఖాస్తు చేసుకున్న కేటగిరీలో అసలు అప్లై చేసిన పోస్టు ఉందో, లేదోనని అభ్యర్థులు ఆందోళన చెందుతుండగా, మరోవైపు రూ. 300 నుంచి రూ. 500 వరకు డీడీల రూపంలో ఫీజు వసూలు చేస్తున్న అధికారులకైనా కనీసం ఏ కేటగిరీలో ఏ పోస్టు ఉందో తెలుసా...? అనే అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు.
ఎవరిని మభ్యపెట్టేందుకు, ఎవరి లబ్ధీకోసం ఈ దాపరికాలు...
ఇప్పటికే ‘ఉద్యోగాల పేరుతో లక్షల్లో బేరసారాలు జరుగుతున్నాయనే ఆరోపణలు’ వినిపిస్తున్న నేపథ్యంలో, రోస్టర్ ముందే ప్రకటిస్తే కావాల్సిన వారికి అనుకూలంగా కేటగిరీల వారీ పోస్టులను సర్దుబాటు చేయడం, బేరసారాలు చేయడం కష్టమవుతుందనే దాస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల వ్యవహారశైలితో ఇటు జిల్లాబాస్ కే కాకుండా అటు ప్రభుత్వానికి సైతం చెడ్డపేరు తెచ్చేలా ఉందని అభ్యర్థులు బాహాటంగా మాట్లాడుకుంటున్నారు.
నోటిఫికేషన్లో తప్పుడు సమాచారం, కేటగిరీల వారీ రోస్ట్ప గోప్యత, తమ కేటగిరీలో పోస్టు ఉందో లేదో వెల్లడించకుండానే అభ్యర్థుల నుంచి ఫీజులు వసూలు చేయడం వంటి పరిణామాలు ప్రభుత్వ నియామక ప్రక్రియపై అనుమానాలకు తావిస్తున్నాయని వారంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి, ఆమోదిత కేటగిరీల వారీ రోస్టర్ను బహిర్గతం చేసి, తప్పులకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. రోస్టర్ పై డీఎంహెచ్ఓ సూపరింటిండెంట్ విశ్వేశ్వర్ రెడ్డిని ‘విజయక్రాంతి’ వివరణ కోరగా రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫికేషన్ లు ఇలాగే ఇస్తున్నామని, ఇందులో ఎలాంటి అవకతవకలకు తావులేదన్నారు.