రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాలి
- రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
జైపూర్, అక్టోబర్ 14: రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్ట సారించాలని, ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా(CP Amber Kishore Jha) ఆదేశించారు. బుధ వారం జైపూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలను పరిశీలించి, సిబ్బంది విధుల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి, సంబంధిత శాఖల సమన్వయంతో హెచ్చరిక బోర్డులు, రహదారి సూచికలు, రంబుల్ స్ట్రిప్స్ తదితర భద్రతా ఏర్పాట్లు చేయించాలని సూచించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై నిరంతరం అవగాహన కల్పిస్తూ, ప్రమాదాల నివారణకు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. సీపీ వెంట జైపూర్ ఏసీపీ ఆర్ వెంకటేశ్వర్లు, జైపూర్ సీఐ నవీన్ కుమార్ తదితరులు ఉన్నారు.