నాటుసారా తయారీపై దాడులు

14-10-2026 | 06:08pm

3,200 లీటర్ల వాష్ ధ్వంసం, 2 కేసులు నమోదు

భద్రాచలం, అక్టోబర్ 14, (విజయక్రాంతి) : ఖమ్మం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, కొత్తగూడెం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి(Kothagudem District Prohibition and Excise Officer)  ఆదేశాల మేరకు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ నాటుసారా తయారీని అరికట్టేందుకు ఇరు రాష్ట్రాల  ఎక్సైజ్ సిబ్బంది  సంయుక్త దాడులు బుధవారం నిర్వహించారు.

ఈ దాడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యటపాక మండలం, చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండువారిగూడెం, పిచుకలపాడు గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 2 కేసులు నమోదు చేసి, సుమారు 3,200 లీటర్ల నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం పులుసు (వాష్)ను ధ్వంసం చేశారు. ఈ దాడులలో  తెలంగాణ రాష్ట్రం నుంచి నరేందర్, నాగేశ్వరరావు, అశోక్ కుమార్, బి కృష్ణయ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి  సురేష్, శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీమతి విజయలక్ష్మి తో పాటు ఇరు రాష్ట్రాల ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

దాడుల అనంతరం ఆయా గ్రామాల ప్రజలకు నాటుసారా సేవించడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, కుటుంబాలపై మరియు సమాజంపై పడే దుష్ప్రభావాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నాటుసారా తయారీ, విక్రయం, నిల్వ మరియు రవాణా వంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఇటువంటి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం అధికారులకు అందించి సహకరించాలని గ్రామస్థులకు సూచించారు.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులు సమన్వయంతో నిర్వహించిన ఈ సంయుక్త దాడులు అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ నాటుసారా తయారీని అరికట్టడం, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం మరియు నాటుసారా దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం లక్ష్యంగా చేపట్టబడ్డాయి.

మరిన్ని వార్తలు