పిచ్చి మొక్కలతో నిండిన కరత్వాడ నీటి కాలువ..
చివరి ఆయకట్టు రైతులకు అందని సాగునీరు...
బోథ్ (విజయక్రాంతి): మండలంలోని తర్వాత చెరువు కుడి ఎడమ కాలువలలో పిచ్చి మొక్కలు పెరగడం వల్ల చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదు. ఇటీవల 10 రోజులపాటు కాలువల ద్వారా సాగునీటి(Irrigation water)ని విడుదల చేశారు. అయితే కుడి ఎడమ కాలువల క్రింద ఉన్న చివరి ఆయకట్టు కౌటా(బి) పోచెర, గ్రామాల రైతులకు సాగునీరు అందకుండా పోయింది. ఎడమ కాలువ క్రింద కౌట గ్రామ రైతులకు సాగునీరు అందకపోవడంతో నీటి తడులు పెట్టలేకపోయామని రాబోతున్నారు. కుడి కాలువ కింద చివరి ఆయకట్టు రైతులకు సైతం నీరు అందకుండా పోయింది.
పిల్ల కాలువలు మాయం...
కుడి ఎడమ కాలువల కింద ఉన్న పిల్ల కాలువలు ఆక్రమణకు గురయ్యాయి. పిల్ల కాలువలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకొని ప్లాట్లుగా మార్చడంతో కాలువలు కనిపించకుండా పోతున్నాయని రైతులు అంటున్నారు. కాలువలను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంతో రైకాంగానికి ఆశించిన స్థాయిలో సాగునీరు అందకుండా పోతున్నది. పిల్ల కాలువలను ఆక్రమించుకొని పలువురు నూతన కట్టడాలు చేపట్టడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. అడిగే నాథుడు లేకపోవడంతో రోజురోజుకు పిల్ల కాలువల జాడ కనిపించడం లేదు.
చివరి ఆయకట్టు రైతుల సంగతేంటి...
కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీరు విడుదల చేసిన కాలువలలో పిచ్చి మొక్కలు పెరగడం వల్ల నీరు అందకుండా పోతుందని చివరి ఆయకట్టు రైతులు అంటున్నారు. ఎంతో ఆశతో సాగునీటి కోసం ఎదురుచూసిన తమ భూముల వరకు నీళ్లు రాలేవని చివరి ఆకట్టు గ్రామాల రైతులు అంటున్నారు.
ఈ ఏడాది ప్రధాన కాలువలలో చెట్లను తొలగించే ప్రక్రియ చేపట్టిన పూర్తిస్థాయిలో చెట్లను తొలగించకపోగా కాలువ ధ్వంసం అయిందని అంటున్నారు. మరోవైపు కొంతమంది రైతులు ప్రధాన కాలువ మధ్యలో అడ్డుకట్టలు వేసి నీటిని తమ చేలకు తరలించుకుపోయారని వాపోతున్నారు. జిల్లా అధికారులు పిల్ల కాలువల దుస్థితిపై పరిశీలించి రైతులకు సాగునీరు అందే విధంగా చూడాల్సిన అవసరం ఉంది.