గుంత తీసారు సరే.. పూడ్చడం ఇంకెప్పుడు?
- నెల రోజులుగా ప్రమాదకరంగా గుంత..
- విద్యార్థుల రాకపోకలతో ఆందోళన
పాపన్నపేట,అక్టోబర్08: పైపులైన్ లీకేజీ మరమ్మతుల కోసం గుంత తీశారు.. పని పూర్తయినా పూడ్చడం మరిచారు!. మండల పరిధిలోని అబ్లాపూర్ గేటు వద్ద మిషన్ భగీరథ లీకేజీ(Mission Bhagiratha Leakage) మరమ్మతుల కోసం తీసిన గుంత నెల రోజులుగా అలాగే వదిలేయడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లీకేజీ మరమ్మతులు పూర్తయినప్పటికీ గుంతను పూడ్చకపోవడంతో ప్రతిరోజూ ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. ముఖ్యంగా పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్థులు ఇదే మార్గం గుండా రాకపోకలు సాగిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయమై మిషన్ భగీరథ ఏఈని సంప్రదించగా తమ దృష్టికి రాలేదని తెలిపినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చి, విద్యార్థులు, ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.