అంబేద్కర్ నగర్ రోడ్డు వెడల్పు పనులు వెంటనే ప్రారంభించాలి
చేర్యాల: చేర్యాల పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో రోడ్డు వెడల్పు(Road Widening) పనులను వెంటనే ప్రారంభించాలని, రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వమే ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Homes) నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, ఎమ్మార్పీఎస్ టీఎస్, సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా కార్యదర్శి అందే బీరన్న, ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర కార్యదర్శి భూమిగారి రాజేందర్, సీపీఐ చేర్యాల మండల సహాయ కార్యదర్శి రామగళ్ళ నరేష్ మాట్లాడుతూ, రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు కోల్పోయిన పేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
బాధితులను నిరాశ్రయులుగా వదిలేయకుండా ప్రభుత్వ ఖర్చుతోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను సమావేశపరిచి వారి డిమాండ్లు తెలుసుకొని పనులు ప్రారంభించాలని కోరారు.ప్రజా సమస్యల పరిష్కారంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నిర్లక్ష్యం వహిస్తే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో చుంచు అశోక్, గజ్జల సురేందర్, మల్లిగారి వినయ్ కుమార్, భూమిగారి బిక్షపతి, ఎర్రమైసగల్ల లక్ష్మి, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.