వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన

13-11-2026 | 12:37pm

ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి

వెల్దుర్తి,(విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావం(El Nino effect), రానున్న రోజుల్లో నెలకొనే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు(Farmers ) ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యవసాయ సాగులో తగిన మార్పులు చేసుకోవాలని అధికారులు సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టడంతో పాటు నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

 శుక్రవారం వెల్దుర్తి మండల పరిధిలోని  ఆరెగూడెం బస్వాపూర్ గ్రామాల్లో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో  ఆధ్వర్యంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు గ్రామాలకు చేరుకొని రైతులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. వర్షపాతం తగ్గే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలపై పూర్తిగా ఆధారపడకుండా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పంటల అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని, వ్యవసాయంలో నీటి పొదుపు పద్ధతులను పాటించాలని వివరించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల ఎంపిక, సాగు విధానాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా నష్టాలను కొంతవరకు తగ్గించుకోవచ్చని తెలిపారు.

అలాగే బీవీజీ రాంజీ పథకం ద్వారా రైతులకు ఉపయోగపడే విధంగా నీటి తొట్ల నిర్మాణం, ఇంకుడు గుంతల ఏర్పాటు, పశుగ్రాసం పెంపకానికి అవసరమైన పనులకు నిధులు మంజూరు చేస్తామని అధికారులు వివరించారు. ఈ పథకం ద్వారా లభించే అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకొని తమ వ్యవసాయ భూముల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు