అధికారుల అశ్రద్ధ.. వన సంపదకు దిష్టి!
రూ.లక్షలు వెచ్చించి పెంచిన నర్సరీకి గ్రహణం
నిధుల లేమి, పర్యవేక్షణ లోపంతో వెలవెలబోతున్న నర్సాపూర్ సెంట్రల్ నర్సరీ
నర్సాపూర్, అక్టోబర్ 19 : ఒకప్పుడు పచ్చని చెట్లతో, వేలాది మొక్కల పెంపకంతో(Plant cultivation) కళకళలాడిన ఆ ప్రాంతం ఇప్పుడు వెలవెలబోతోంది. నిధుల కొరత, అధికారుల నిర్లక్ష్యం తోడవడంతో ప్రాధాన్యత కోల్పోయి అనాథగా మారింది. మెదక్ జిల్లా(Medak District) నర్సాపూర్‌లోని అటవీ శాఖ సెంట్రల్ నర్సరీ కథ ఇది. మూడేళ్ల క్రితం వరకు నిత్యం కూలీల సందడి, ఆధునిక పద్ధతుల్లో మొక్కల పెంపకంతో ప్రసిద్ధి చెందిన ఈ నర్సరీ.. నేడు నిర్వహణ లేక ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడింది.
మూడు దశాబ్దాల చరిత్ర.. లక్షలాది మొక్కల పెంపకం
నర్సాపూర్‌లోని జాతీయ రహదారి (765డి) ఆనుకుని మూడు హెక్టార్ల విస్తీర్ణంలో ఈ సెంట్రల్ నర్సరీని(Central Nursery) ఏర్పాటు చేశారు. దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ నర్సరీ నుంచి ఏటా లక్షలాది మొక్కలను పెంచి జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసేవారు. రెండేళ్ల క్రితం వరకు కూడా ఇక్కడ సుమారు 15 నుండి 20 లక్షల మొక్కలను పెంచగా, దాదాపు 40 నుండి 50 మందికి పైగా కూలీలు నిరంతరం పనులు చేస్తూ ఉపాధి పొందేవారు.
‘కోతుల బెడద నియంత్రణకు రూ.10 లక్షల సోలార్ కంచె..
నర్సాపూర్ అటవీ ప్రాంతం కావడంతో నర్సరీలోని మొక్కలను కోతులు నాశనం చేయకుండా అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మొక్కల రక్షణతో పాటు పనుల్లో ఉన్న కూలీలపై కోతులు దాడి చేయకుండా నివారించేందుకు రూ.10 లక్షల వ్యయంతో సోలార్ విద్యుత్ కంచెను కూడా ఏర్పాటు చేశారు. అంతలా ప్రాధాన్యమిచ్చిన ఈ నర్సరీ క్రమంగా నిధుల కోతతో దెబ్బతింది.
‘కనుమరుగైన వనవిహారి.. కిలోమీటర్ ట్రెకింగ్ వ్యర్థం
ఈ నర్సరీలోని కొంత భాగాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు గతంలో ‘వనవిహారి’ పేరుతో పనులు చేపట్టారు. పర్యాటకులను ఆకట్టుకునేలా కిలోమీటరు మేర ట్రెకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా, ఎత్తయిన గుట్టపై అందమైన కుటీరాన్ని (గాజెబో) నిర్మించారు. అయితే సరైన నిర్వహణ, పర్యవేక్షణ కరువవ్వడంతో ఈ కుటీరం కాలక్రమేణా కనుమరుగైంది.