ఏసీబీ వలలో.. బంజారాహిల్స్ ఎస్సై
- రూ. లక్ష లంచం తీసుకుంటూ..
- పోలీస్ స్టేషన్‌లోనే పట్టుకున్న అధికారులు
- 20 వేలు తీసుకుంటూ దొరికిన యాదాద్రి జిల్లా కొలతలు, తూనికల అధికారి
ఖైరతాబాద్/యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 28 (విజయక్రాంతి): అవినీతి అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB)కి చిక్కారు. పోలీస్ స్టేషన్‌లోనే రూ.లక్ష లంచం తీసుకుంటూ బంజారాహిల్స్ ఎస్సై విజయ్(SI Vijay) పట్టుబడ్డాడు. 20 వేలు లంచం తీసుకుంటూ యాదాద్రి జిల్లా కొలతలు, తూనికల అధికారి, ఓ పెట్రోల్ బంకు టెక్నిషియన్ పట్టుబడ్డారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు బుధవారం సాయంత్రం సోదాలు నిర్వహించారు. బాధితుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఎస్సై విజయ్ పట్టుబడ్డాడు.
పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసుకు సంబంధించి, బెయిల్ మంజూరులో సహాయం చేయడం, నోటీసులు జారీ చేయడంలో అనుకూలంగా వ్యవహరించడానికి ఎస్సై విజయ్ బాధితుడిని రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహం పన్నారు. మొదటి విడతగా రూ.లక్ష నగదును బాధితుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లోనే ఎస్సై విజయ్‌కు అందిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సైను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఛాంబర్‌తో పాటు స్టేషన్‌లోని సంబంధిత కేస్ డైరీ డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
పెట్రోల్ బంక్ టెక్నీషియన్ ద్వారా లంచం..
యాదాద్రి జిల్లా కొలతలు తూనికల శాఖ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఓ ప్రైవేట్ పెట్రోల్ బంక్ టెక్నిషియన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. చౌటుప్పల్‌లోని ఓ పెట్రోల్ బంక్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ జారీ, డైలీ సేల్స్ రిజిస్టర్ అప్పగించేందుకు కొలతలు తూనికల శాఖ ఇన్‌స్పెక్టర్ రూ.20 వేలు డిమాండ్ చేసినట్లు సమాచారం.
బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా.. ఇన్‌స్పెక్టర్ సూచనల మేరకు హైదరాబాద్ ఎల్బీనగర్‌లో పెట్రోల్ బంక్ టెక్నీషియన్ రవీందర్ ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇందులో రూ.15 వేలు ఇన్‌స్పెక్టర్‌కు, రూ.5 వేలు టెక్నీషియన్‌కు చెందాల్సి ఉన్నట్లు తెలిసింది. ఇద్దరినీ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.