అక్రమ నిర్మాణాల వెనుక 'హస్తం' ఎవరిది..?
- సాయి అనురాగ్ కాలనీలో పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు
- పార్టీ నాయకుడి అండ ఉందంటూ ఆరోపణలు
- పట్టించుకోని నిజాంపేట్ సర్కిల్ అధికారులు
కుత్బుల్లాపూర్, అక్టోబర్ 28(విజయక్రాంతి): నిజాంపేట్ సర్కిల్ పరిధి సాయి అనురాగ్ కాలనీలో అక్రమ నిర్మాణాలు(Illegal Constructions) పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అనుమతులు కొంత వరకే తీసుకొని బహుళ అంతస్థులు నిర్మిస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. కనీసం సెట్ బ్యాక్స్ వదలకుండా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.
పార్టీ నాయకుడి అండ... స్థానికుల ఆరోపణలు
అయితే అక్రమ నిర్మాణాల వెనుక అధికార పార్టీ నాయకుడి అండ ఉందంటూ స్థానికులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.బాచుపల్లి, సాయి అనురాగ్ కాలనీలో ఎక్కడైనా సరే ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరిగిన అక్కడ వాలిపోతు నిర్మాణదారులతో సెటిల్మెంట్ల్ చేస్తూ సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం పార్టీ నాయకులకు లొంగిపోయి నిర్మాణదారులకు సహకరిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇలా కొందరు పార్టీ నాయకులు అక్రమ నిర్మాణాలకు సహకరిస్తూ ప్రభుత్వానికి మచ్చ తెస్తున్నారని బహిరంగంగా చర్చలు జరుగుతున్నాయి.
అయినప్పటికీ అవేమి పట్టకుండా కొందరు గల్లీ నాయకులు తమ ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణదారుల దగ్గర బేరసారాలు కుదుర్చుకొని టౌన్ ప్లానింగ్ అధికారులను సైతం చర్యలు తీసుకోవద్దంటూ సిఫార్సులు జారీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు
అయితే నిజాంపేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు అక్రమ నిర్మాణాలపై పలు ఫిర్యాదులు వస్తున్నప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.టౌన్ ప్లానింగ్ సిబ్బంది ప్రభుత్వ అధికారులు అయ్యుండి, ప్రభుత్వం నుండి అన్నీ హక్కులు కలిగి ఉన్నప్పటికీ ఒక గల్లీ నాయకుడి సిఫార్సులతో నిర్మాణదారులకు లొంగిపోవడం ఏంటని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి సాయి అనురాగ్ కాలనీలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.