భక్తులకు నిలువు దోపిడీ..

19-11-2026 | 05:00am
  1. కీసరగుట్టలో అంతా మోసం..
  2. పూజా సామాగ్రి అధిక ధరలకు విక్రయం 
  3. వాటర్ బాటిల్ ధర 50 శాతం ఎక్కువ 
  4. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు 
  5. కార్తీకమాసం కావడంతో అధికసంఖ్యలో తరలివస్తున్న మహిళలు 

మేడ్చల్, నవంబర్ 18 (విజయక్రాంతి): ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న ప్రముఖ శైవక్షేత్రం కీసరగుట్ట(Keesaragutta)లో భక్తులు నిలువునా దోపిడీకి గురవుతున్నారు. రామ లింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి, మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన భక్తులు ఇక్కడి ధరలు చూసి బెంబేలు పడుతున్నారు. పార్కింగ్ నుంచి దర్శనం చేసుకుని తిరిగి వెళ్లే వరకు దోపిడీకి గురవుతున్నారు. ఇక్కడ ప్రతి వస్తువు  ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.

కొన్ని వస్తువులు ఎంఆర్పి కంటే 50% ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో వ్యాపారా లు నిర్వహించుకోవడానికి దేవాదాయ శాఖ టెండర్లు నిర్వహిస్తుంది. ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని టెండర్ లో నిబంధన ఉంటుంది. ఎమ్మార్పీ లేని వస్తువులు, పూ జా సామాగ్రి ధర లను దేవాదాయ శాఖ నిర్ణయిస్తుంది. ఆ ధరలకు వ్యాపారు లు విక్రయించాలి. కానీ స్థానిక దేవాలయ అధికారు లు భక్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో మహిళలు దీపం వెలిగించడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి మహిళలు తరలి వస్తున్నారు. వత్తులు, దీపా ల ధరలు చూసి బెంబేలు పడుతున్నారు. రెండు ఉసిరికాయలు, రెండు దీపాలు, 365 వత్తులు, రెండు అగర్బత్తిలు రూ.200 కు విక్రయిస్తున్నారు. ఒక్కరికి సంబంధించిన పూజా సామాగ్రికి రూ.100 వసూలు చేస్తున్నారు. దీప దానానికి సంబంధించిన పూజా సామాగ్రి రూ.100కు విక్రయిస్తున్నారు. వాస్తవానికి వీటిలో రూ.30, రూ.40 విలువ చేసే పూజ సామాగ్రి మాత్రమే ఉంటుంది. రూ.10 విలువచేసే పాల ప్యాకెట్ ధర రూ.20, కొబ్బరికాయ రూ.70 కి విక్రయిస్తున్నారు. 

వాటర్ బాటిల్ ధర 50 శాతం అధికం..

లీటర్ వాటర్ బాటిల్ ధర ఎంఆర్‌పీ రూ 20 ఉండగా, రూ.30కి విక్రయిస్తున్నారు. 250 ఎం.ఎల్ కూల్ డ్రింక్ ఎంఆర్పి ధర రూ.20 ఉండగా, రూ.30 కి విక్రయిస్తున్నారు. అంటే 50 శాతం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇంత దోపిడీ ఎక్కడా లేదు. బస్టాండ్లలో, దేవాలయాల్లో కూలింగ్ పేరిట రూ. రెండు నుంచి ఐదు వరకు ఎక్కువ తీసుకుంటారు. కానీ ఇక్కడ అవి శాతం ఎక్కువ తీసుకోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

అధికారుల కనుసన్నల్లోనే అధిక ధరలకు విక్రయం..

దేవాలయ అధికారుల కనుసన్నల్లోనే వస్తువులు అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులకు, అధికారులకు మధ్య అవగాహన ఉందని అంటున్నారు. పాలకవర్గం సైతం ఈ విషయ మై పట్టించుకోవడం లేదు. ప్రతి దుకాణం ముందు పూజ సామాన్లకు సంబంధించి ధరల పట్టిక ఏర్పాటు చేయాలి. కానీ ఏ దుకాణం ముందు ధరలు పట్టిక కనిపించడం లేదు. అధిక ధరలకు విక్రయించడం చట్టరీత్యా నేరమని, వెంటనే అధికారులు, పాలకవర్గ సభ్యులు తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు