పేదల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఐ పోరాటం

28-10-2026 | 10:22pm
  1. భగత్ సింగ్ నగర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి..
  2. అర్హులైన పేదలకు పట్టాలు మంజూరు చేయాలి...
  3. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

మేడిపల్లి, అక్టోబర్ 28 (విజయక్రాంతి): పేద ప్రజల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణే లక్ష్యంగా సీపీఐ పార్టీ(CPI Party) నిరంతరం పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Kothagudem MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. బుధవారం బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని 10వ డివిజన్‌ భగత్ సింగ్ నగర్ కాలనీలో మేడిపల్లి మండల సీపీఐ కార్యదర్శి రచ్చ కిషన్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సాంబశివరావు సీపీఐ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ కాలనీలో నివసిస్తున్న అర్హులైన పేద లకు ఇంటి పట్టాలు లేని వారికి ప్రభుత్వం వెంటనే పట్టాలు మంజూరు చేయాలని, ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని,

కాలనీలో నివసిస్తున్న పేదలకు కనీస మౌలిక వసతులు కల్పించడం, పట్టాలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం సాధించే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ  కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. ఎస్ బోస్, జిల్లా కార్యదర్శి ఉమామహేష్, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జి. దామోదర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు జె. లక్ష్మి, కె. ధర్మేందర్, సత్యప్రసాద్, పార్టీ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు