తెలుగువాళ్లంతా కనెక్ట్ అయ్యే కంటెంట్

14-09-2026 | 05:30am

రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణ, సన్నీ అఖిల్, విరాట్, సాయిప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పిఠాపురంలో అలా మొదలైంది’(pitapuramlo alaa modalaindi). ‘ప్రేయసి రావే’ (preyasi raave)ఫేమ్ మహేశ్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిందీ సినిమా. మహేశ్ చంద్ర సినిమా టీమ్, ఎవర్‌గ్రీన్ ఎపిక్ సినిమా బ్యానర్లపై దుండిగళ్ల బాలకృష్ణ, ఆకుల సురేశ్ పటేల్, ఎఫ్‌ఎం  మురళి నిర్మించారు.

సెప్టెంబర్ 18న విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను (Pre-release event )మేకర్స్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇదే వేదికపై ప్రముఖ నటుడు సుమన్ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. “కొత్త కంటెంట్‌తో, ఫ్రెష్ సబ్జెక్టుతో తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నా” అన్నారు. ‘ఈ టైటిల్ చూసినప్పుడే సినిమా హిట్ అవుతుందని అనుకున్నా’నని తెలంగాణ ఛాంబర్ సెక్రటరీ అనంతగిరి తెలిపారు.

నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “నా 49 ఏళ్ల కెరీర్‌లో నాకు దొరికిన అదృష్టం, నాకు దొరికిన మంచి పాత్రలు. ప్రపంచంలో వున్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది. అందరి ఇళ్లలో వుండే కథ” అన్నారు. దర్శకుడు మహేశ్‌చంద్ర మాట్లాడుతూ.. “ప్రస్తుతం ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలే నడుస్తున్నాయి. నేను చేసిన అన్ని సినిమాల్లోకెల్లా ఇది మరోస్థాయిలో ఉంటుంది” అని చెప్పారు.

‘ప్రతీ తల్లి, తండ్రి, కూతురు చూడాల్సిన సినిమా’ అని నిర్మాత దుండిగల్ల బాలకృష్ణ అన్నారు. నిర్మాత ఆకుల సురేశ్ మాట్లాడుతూ.. “నా ఊర్లో ఎన్నో కుటుంబాల్ని చూసి ఈ కథ రాసుకున్నా. చంద్రమహేశ్‌కు వినిపించా. ఇప్పుడు నా కథ ‘పిఠాపురంలో అలా మొదలైంది’ అంటూ రాబోతోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ చిత్రం నచ్చుతుంది” అని తెలిపారు. నిర్మాత ఎఫ్‌ఎం మురళీ మాట్లాడుతూ.. “ఈ సినిమాను మా ఊర్లో, మా ఇంట్లో షూట్ చేశారు.

సినిమా చూసి భావోద్వేగంతో బయటకు వచ్చా. యూత్‌కు, ఫ్యామిలీలకు ఈ చిత్రం నచ్చుతుంది” అని తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన టాలీవుడ్ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్, దర్శకులు రామ్‌ప్రసాద్, సముద్ర, వీర శంకర్, దర్శక రచయిత బీవీఎస్ రవిలతోపాటు ఈ చిత్రంలోని నటీనటులు మణిచందన, సత్యం రాజేశ్, కిరాక్ ఆర్పీ, పృథ్వీ, కేదార్ శంకర్, శ్రీలు, విరాట్, సన్నీ, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బాధ్యడు చైతన్యరెడ్డి తదితర చిత్రబృందం ఈ ఈవెంట్‌లో మాట్లాడారు. 


మరిన్ని వార్తలు