సౌత్ ఇండియన్‌ను.. అందుకే నన్ను పక్కనపెట్టారు!
జాన్వీ కపూర్(Janhvi Kapoor), రాధికా ఆప్టే(Radhika Apte) వంటి ఉత్తరాది నటీమణులు దక్షిణాది సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేయడంపై, ఇక్కడి పనితీరుపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు నెట్టింట వివాదానికి తెర తీశాయి. తాజాగా ఈ విషయంపై హీరోయిన్ రెజీనా కసాండ్రా(Actress Regina Cassandra) స్పందిస్తూ, “సినిమా సెట్స్ లో మీపై ఎవరూ అత్యాచారం చేయడం లేదు కదా’ అంటూ తీవ్ర పదజాలంతో ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఒక ప్రాజెక్ట్ లేదా అందులోని సీన్స్ మీకు నచ్చకపోతే, ‘నేను ఇది చేయలేను’ అని చెప్పి సినిమా నుంచి బయటకు వచ్చే పూర్తి హక్కు ప్రతి హీరోయిన్‌కు ఉంటుంది.
అలా బయటకు వచ్చి ఆ విషయాన్ని ధైర్యంగా వార్తల్లో చెప్పాలే తప్ప, అంతా అయిపోయాక కూర్చొని మాట్లాడటం సరికాదు. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల నో చెప్పలేకపోవచ్చు, అది నేను అర్థం చేసుకోగలను. కానీ గుర్తుపెట్టుకోండి, అక్కడ మీపై ఎవరూ అత్యాచారం చేయడం లేదు. మిమ్మల్ని పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఎవరూ ఉంచడం లేదు. ఈ రోజుల్లో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి అనేక చట్టపరమైన మార్గాలు ఉన్నాయి.
‘కేసరి చాప్టర్ 2’ సినిమాలో నేను కథానాయకుడు అక్షయ్ కుమార్ భార్య పాత్ర పోషించినప్పటికీ, చిత్ర ప్రమోషన్ల నుంచి నా పేరును ఎలాంటి ముందస్తు సమాచారం కానీ, కారణం కానీ లేకుండా పూర్తిగా పక్కన పెట్టారు. ఒక ప్రమోషనల్ పాటను సోషల్ మీడియాలో విడుదల చేసినప్పుడు, కనీసం నా పేరును ట్యాగ్ కూడా చేయకుండా ధర్మ ప్రొడక్షన్స్ పూర్తిగా విస్మరించింది. బాలీవుడ్లో నాకు హిందీ అనర్గళంగా మాట్లాడటం, రాయడం వచ్చినా కూడా కేవలం నేను దక్షిణాది నటిని కావడం వల్లే ఈ విధమైన వివక్ష చూపించారా?
సినిమా ఇండస్ట్రీలో ఒక వైపున నటించి, పారితోషికం తీసుకుని, ఆ తర్వాత ఇండస్ట్రీపై లేదా తోటి నటీనటులపై నెగిటివిటీని ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు. సినిమా అనేది కేవలం భాష లేదా ప్రాంతానికి సంబంధించినది కాదు, అది కళకు సంబంధించినది. చిత్ర పరిశ్రమలో మహిళల తరుపున నిలబడటానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటా. కానీ, ఇలాంటి విషయాలను పట్టుకుని నార్త్ వర్సెస్ సౌత్ విభజనను సృష్టించడం చాలా తప్పు. ఇది ఇండస్ట్రీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు” అని తెలిపింది రెజీనా. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతుండగా, సౌత్ ఇండస్ట్రీ వర్గాల నుంచి, నెటిజన్ల నుంచి ఆమెకు విస్తృతంగా మద్దతు లభిస్తోంది.