ఒకే రైలులో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం

06-11-2026 | 02:02pm

ఆలేరు, నవంబర్ 6 (విజయక్రాంతి): తీర్థయాత్రలు చేయాలనుకునే భక్తుల సౌకర్యార్థం భారతీయ రైల్వే ఆధ్వర్యంలోని ఐఆర్‌సీటీసీ (IRCTC Tourism) భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం నవంబర్ 10 నుంచి డిసెంబర్ 27 వరకు నాలుగు ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర ప్యాకేజీలను నిర్వహించనున్నట్లు ఐఆర్‌సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పి.వి. వెంకటేష్ తెలిపారు. గురువారం భువనగిరి రైల్వేస్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యాత్రల వివరాలు, టికెట్ ధరలు, కల్పించే సౌకర్యాలను వెల్లడించారు.

నాలుగు ప్రత్యేక యాత్ర ప్యాకేజీలు

1. సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర (SCZBG68)

నవంబర్ 10 నుంచి 20 వరకు జరిగే ఈ యాత్రలో ఉజ్జయినిలో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, ద్వారకలో నాగేశ్వర్, సోమనాథ్, పూణేలో భీమశంకర్, నాసిక్‌లో త్రయంబకేశ్వర్, ఛత్రపతి సంభాజీనగర్‌లో ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. టికెట్ ధరలు స్లీపర్ క్లాస్ రూ.18,000, 3 ఏసీ రూ.27,400, 2 ఏసీ రూ.35,500గా నిర్ణయించారు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ మీదుగా ప్రయాణిస్తుంది.

2. దివ్య దక్షిణ యాత్ర జ్యోతిర్లింగంతో (SCZBG69)

నవంబర్ 23 నుంచి డిసెంబర్ 1 వరకు నిర్వహించే ఈ యాత్రలో తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, చిదంబరం, తిరుచ్చి, తంజావూరు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. స్లీపర్ క్లాస్ రూ.15,800, 3 ఏసీ రూ.23,200, 2 ఏసీ రూ.29,600గా టికెట్ ధరలు నిర్ణయించారు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి చర్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళ్తుంది.

3. అయోధ్య–కాశీ–బైద్యనాథ్ ధామ్ దర్శన్ యాత్ర (SCZBG70)

డిసెంబర్ 5 నుంచి 14 వరకు జరిగే ఈ యాత్రలో పూరీ, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, వారణాసి (కాశీ), అయోధ్య, ప్రయాగరాజ్ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. స్లీపర్ క్లాస్ రూ.17,000, 3 ఏసీ రూ.26,400, 2 ఏసీ రూ.34,400గా ధరలు నిర్ణయించారు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా ప్రయాణిస్తుంది.

4. సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర (SCZBG71):

డిసెంబర్ 17 నుంచి 27 వరకు మరోసారి సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రలో ఉజ్జయిని, ద్వారక, సోమనాథ్, పూణే, నాసిక్, ఛత్రపతి సంభాజీనగర్‌లోని ప్రముఖ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. స్లీపర్ క్లాస్ రూ.18,000, 3 ఏసీ రూ.27,400, 2 ఏసీ రూ.35,500గా టికెట్ ధరలు నిర్ణయించారు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ మీదుగా వెళ్తుంది.

ఈ ప్యాకేజీల్లో రైలు ప్రయాణంతో పాటు స్థానిక బస్సు ప్రయాణం, హోటల్ వసతి, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, తాగునీటి సీసాలు, టూర్ ఎస్కార్ట్ సేవలు, సందర్శనా స్థలాలకు రవాణా, ప్రయాణ బీమా (Travel Insurance) కల్పించనున్నారు. రైల్వే స్టేషన్ నుంచి దేవాలయాల వరకు రవాణా సౌకర్యం కూడా ప్యాకేజీలో భాగంగా ఉంటుంది. ప్రతి కోచ్‌కు ఒక భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు రైలులో సీసీ కెమెరాల (CCTV Surveillance) ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నారు.


యాత్రల్లో పాల్గొనాలనుకునే భక్తులు 9701360701, 9281030744, 9281030734, 9281030727, 9281030759 నంబర్లను సంప్రదించి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం www.irctctourism.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని వెంకటేష్ సూచించారు. ఈ సమావేశంలో ఐఆర్‌సీటీసీ టూరిజం మానిటర్లు నరేష్ బాబు ఓర్సు, ప్రశాంత్, జయంత్ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు