మా కామ్రేడ్ కళ్యాణ్ అందరినీ నవ్విస్తాడు!
శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’గా(Sree Vishnu’s ‘Comrade Kalyan’) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జానకి రామ్ మారెళ్ల(Janaki Ram Marella) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్పీ బ్యానర్‌పై వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. మహిమా నంబియార్(Mahima Nambiar) హీరోయిన్. అక్టోబర్ 9న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలు డైరెక్టర్ జానకిరామ్ విలేకరులతో పంచుకున్నారు. “టైటిల్ ‘కామ్రేడ్ కళ్యాణ్(Comrade Kalyan)’.. కానీ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఈ టైటిల్ కథ నుంచే వచ్చింది. శ్రీవిష్ణు బలం ఎంటర్‌టైన్‌మెంట్.
అది ఇందులో బలంగా ఉంటుంది. ఒక సమస్యలో ఉన్న వ్యక్తి అటువైపు వెళ్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. రిస్కీ లొకేషన్లలో షూట్ చేశాం. మంగళూరు దగ్గర ఆగుంబె అనే డీప్ ఫారెస్టుకు వెళ్లాం. ప్రపంచం లోనే ఎక్కువ కోబ్రాలు ఉండే అడవి అది. యూనిట్లో దాదాపు అందరం రిస్కు తీసుకున్నాం. నేను తొలి రోజే పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నా. ప్రేక్షకులకు మంచి వినోదం ఇవ్వడానికే ఇంత రిస్క్ తీసుకున్నాం” అని చెప్పారు.
రాధిక ఫ్లోలో బాలకృష్ణ సినిమాల క్రమం తప్పారు
‘కామ్రేడ్ కల్యాణ్’ చిత్రంలో నటి రాధికా శరత్‌కుమార్ బాలకృష్ణ అభిమానిగా నటించారు. అయితే, ఇటీవల విడుదలైన మూవీ ట్రైలర్‌లో నటి రాధిక.. బాలకృష్ణ పాత సినిమాల విడుదల తేదీలను తప్పుగా చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ పొరపాటు ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు విషయంలో జరిగిందంటే ఓకే, కానీ సీనియర్ నటితో సినిమాల వరుస క్రమం చెప్పించేటప్పుడు జాగ్రత్త తీసుకోవా ల్సింది అంటూ వార్తలు వచ్చాయి. ఇదే విషయంపై స్పందించాలని ‘విజయక్రాంతి’ కోరగా, డైరెక్టర్ జానకిరామ్ స్పందించారు. “రాధిక అద్భుతమైన నటి.
ఆమె చేసిన పాత్రలు గుర్తుండిపోయేలా ఉంటాయి. ఇందులో ఆమె బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తారు. రాధిక.. బాలకృష్ణ సినిమా విడుదల తేదీలను తారుమారు చేశారంటూ ట్రైలర్ చూసినవాళ్లు ప్రచారం చేస్తున్నారు. అయితే, చాలా మంది అభిమానులు తమ హీరోల సినిమాలనే గుర్తుంచుకుంటారు. కానీ, ఆ విడుదల తేదీలను ఫ్లోలో తప్పుగా చెప్పే అవకాశం ఉంది. రాధిక కూడా అంతే! సినిమాలో బాలకృష్ణ ఫ్యాన్‌గా ఆయన పాత సినిమాల రిలీజ్ డేట్లను డైలాగ్ చెప్పే ఫ్లోలో ముందుది వెనక.. వెనకది ముందు చెప్పారు. ఆ డైలాగులను సరిచేసేంత సమయం లేదు” అని తెలిపారు.