బెంగళూరు ఇంగ్లీష్ శిక్షణ శిబిరానికి శ్యాంప్రసాద్ ఎంపిక
వెంకటాపూర్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): బెంగళూరులో నిర్వహించనున్న ఇంగ్లీష్ శిక్షణ శిబిరానికి మండలంలోని పాపయ్యపల్లి ప్రభుత్వ పాఠశాల(Papayyapalli Government School) ప్రధానోపాధ్యాయుడు నూకల శ్యాంప్రసాద్ ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ(Department of Education) ఉత్తర్వులు జారీ చేసింది.
నవంబర్ 3 నుంచి డిసెంబర్ 2 వరకు నెల రోజుల పాటు బెంగళూరులోని రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్, జనభారతి క్యాంపస్‌లో శిక్షణ కొనసాగుతుందని శ్యాంప్రసాద్ తెలిపారు. శిక్షణ అనంతరం జిల్లా స్థాయిలో రిసోర్స్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనను మరింత మెరుగుపరచడంతో పాటు ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో విద్యాశాఖ ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.
తన ఎంపికకు సహకరించి ప్రోత్సహించిన జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి, ఏఎంఓ శ్యాంసుందర్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్, జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు శ్యాంప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.