గ్రామ అవసరాలే అభివృద్ధికి ప్రామాణికం
మంత్రి సీతక్క
వెంకటాపూర్, నవంబర్ 06 (విజయక్రాంతి): గ్రామాల్లో ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. శుక్రవారం మండలంలోని నారాయణగిరిపల్లెలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, రామాంజపురంలో రూ.135 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను, రూ.150 లక్షలతో నిర్మించిన రహదారిని ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో స్మార్ట్ రేషన్‌కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లో అవసరమైన పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మార్కెట్ ధర కంటే తక్కువగా రూ.230 నుంచి రూ.250కే సిమెంట్ బస్తా అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నాలుగున్నర లక్షల మందికి ఈ నెల 8 నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
మండలంలో 11,863 మందికి స్మార్ట్ రేషన్‌కార్డులు అందిస్తున్నామని, అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కళ్యాణి, పంచాయతీరాజ్ డైరెక్టర్ భగవాన్‌రెడ్డి, తహసీల్దార్ గిరిబాబు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.