భూగర్భ జలాల తోడివేత!
- ప్రైవేట్ ట్యాంకర్లతో అక్రమంగా నీటి తరలింపు
- ఎలాంటి అనుమతులు లేకుండానే బోర్లు ఏర్పాటు
- స్థానిక బోర్లలో తగ్గుతున్న నీటి మట్టాలు
- అక్రమ నీటి వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
మేడిపల్లి, నవంబర్ 6 (విజయక్రాంతి): ఓవైపు ఎల్నినో(El Niño) ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోతుండగా.. మరోవైపు కొందరు వ్యాపారులు అక్రమ నీటి వ్యాపారానికి తెరలేపుతున్నారు. నిబంధనలు, అనుమతులను పట్టించుకోకుండా బోర్లు ఏర్పాటు చేసి, వాటి నుంచి నీటిని తోడుతూ ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా యథేచ్ఛగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో స్థానికంగా భూగర్భ జలాలపై ఆధారపడుతున్న నివాసితులు నీటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా(Medchal-Malkajgiri district) మేడిపల్లి మండల పరిధిలోని వరంగల్ ప్రధాన రహదారిపై పిల్లర్ నంబర్ 132, 135 సమీపంలో రెండు ప్రాంతాల్లో బోర్లు ఏర్పాటు చేసి వాటి నుంచి పెద్దఎత్తున నీటిని తోడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ బోర్ల నుంచి నీటిని ప్రైవేట్ ట్యాంకర్లలో నింపి వివిధ ప్రాంతాలకు తరలిస్తూ విక్రయిస్తున్నారని పేర్కొంటున్నారు. వ్యాపార అవసరాల కోసం భూగర్భ జలాలను నిరంతరం తోడటం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లోని నీటి వనరులపై ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా వేసవి పరిస్థితులు, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో భూగర్భ జలాల పరిరక్షణ ఎంతో అవసరం. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో నీటి మట్టాలు తగ్గుతున్నాయని, ఇళ్లలో ఏర్పాటు చేసుకున్న బోర్లలోనూ నీరు సరిగా రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. గతంలో సమృద్ధిగా నీరు అందించిన బోర్లు ప్రస్తుతం నీటి కొరతను ఎదుర్కొంటున్నాయని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపార అవసరాల కోసం భారీగా నీటిని తోడటం కొనసాగితే భవిష్యత్తులో స్థానికులకు తాగునీటి ఇబ్బందులు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
బోర్లు ఏర్పాటు చేయడానికి సంబంధిత శాఖల అనుమతులు తీసుకున్నారా? నీటి తరలింపు, విక్రయాలకు నిబంధనలు పాటిస్తున్నారా? అన్న అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బోర్లపై విచారణ జరిపి, అక్రమంగా నీటిని తరలిస్తున్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పిల్లర్ నంబర్ 132, 135 వద్ద కొనసాగుతున్న నీటి తరలింపుతోపాటు మండల పరిధిలోని పలు చోట్ల జరుగుతున్న నీటి వ్యాపారం వ్యవహారంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భూగర్భ జలాలను కాపాడటంతోపాటు ప్రజల తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అక్రమ నీటి వ్యాపారానికి అడ్డుకట్ట వేసి, స్థానికులకు నీటి భద్రత కల్పించాలని కోరుతున్నారు.