అక్కడ మాయం.. ఇక్కడ ప్రత్యక్షం

26-11-2026 | 03:14pm

కన్నాయిగూడెం, నవంబర్ 26 (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో టేకు కలప స్మగ్లింగ్ (Teak Wood Smuggling) వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 16న తుపాకులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని దేవాదుల పంప్‌హౌస్ సమీపంలో జరిగిన కలప అక్రమ రవాణా (Illegal Transportation) ఘటనలో మాయమైన టేకు దుంగలు తాజాగా కంతనపల్లి అటవీ ప్రాంతంలో ప్రత్యక్షం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. సుమారు 20 కిలోమీటర్ల దూరం కలపను తరలించినా స్మగ్లర్లు పట్టుబడకపోవడం అటవీశాఖ నిఘా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఈ నెల 16న దేవాదుల పంప్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో టేకు కలపను అక్రమంగా తరలిస్తున్న సమయంలో వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడినట్లు సమాచారం. ఈ ఘటన అనంతరం అసలు టేకు దుంగలు మాయమై, వాటి స్థానంలో జిట్రేగి దుంగలను ఉంచి అటవీశాఖ అధికారులకు అప్పగించారనే ఆరోపణలు వినిపించాయి. ఈ వ్యవహారంలో కింది స్థాయి సిబ్బంది పాత్రపై అనుమానాలు వ్యక్తం కావడంతో అటవీశాఖ అధికారులు తమ సిబ్బందిపైనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం అప్పట్లో కలకలం రేపింది.

సుమారు 8 నుంచి 9 మంది సిబ్బందిపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని ప్రజలు భావించారు. అయితే రోజుల తరబడి దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ పూర్తి వివరాలు బయటకు రాకపోవడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ వ్యవహారంలో స్మగ్లర్లు, అటవీశాఖ సిబ్బంది మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే ఆరోపణలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా బుధవారం కంతనపల్లి అటవీ ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది గాలింపు (Search Operation) చేపట్టగా 11 టేకు దుంగలు లభించాయి. వీటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అయితే కలపను అక్రమంగా తరలించిన వ్యక్తులు మాత్రం పట్టుబడకపోవడం గమనార్హం.

దేవాదుల పంప్‌హౌస్ పరిసర ప్రాంతాల నుంచి కంతనపల్లి వరకు సుమారు 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రధాన రహదారిపై నిత్యం వాహనాల రాకపోకలు కొనసాగుతున్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో టేకు కలపను తరలించడం ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మధ్యలో దట్టమైన అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ కంతనపల్లి అటవీ ప్రాంతంలోనే కలపను దాచడం వెనుక స్మగ్లర్ల వ్యూహం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు.

అసలు టేకు కలపను అక్రమంగా తరలిస్తున్నది ఎవరు? ఎప్పటి నుంచి ఈ వ్యవహారం కొనసాగుతోంది? వాహనం బోల్తా పడకపోతే ఈ స్మగ్లింగ్ వెలుగులోకి వచ్చేదా? గతంలో నమోదైన ఫిర్యాదుపై విచారణ ఎక్కడి వరకు వచ్చింది? అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ (Investigation) జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

టేకు దుంగల మాయంపై అనుమానాలు.. అధికారుల మౌనం!

నిందితులు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదుట తమ నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. అయితే టేకు దుంగలు మాయమైన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించడంలో అటవీ అధికారులు మౌనం పాటిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఎన్ని టేకు దుంగలు మాయమయ్యాయి? ఈ ఘటనలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? అనే విషయాలపై స్పష్టత ఇవ్వకుండా అధికారులు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

అటవీశాఖ వివరణ

ఈ ఘటనపై ఏటూరునాగారం నార్త్ రేంజ్ ఇన్‌చార్జి రేంజ్ ఆఫీసర్ అశోక్ మాట్లాడుతూ.. కన్నాయిగూడెం మండలం కంతనపల్లిలో బుధవారం అటవీశాఖ సిబ్బంది గాలింపు చేపట్టి 11 టేకు దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని, ఈ ఘటనకు సంబంధించి నిందితులు ఇంకా పట్టుబడలేదని వెల్లడించారు.

స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదుట నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం స్థానిక పోలీస్ అధికారులను సంప్రదించాలని సూచించారు.

ఈ గాలింపు కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఓ జానీ, ఎఫ్ఎస్ఓలు వేణుగోపాల్ రెడ్డి, తార్, ఎఫ్‌బీఓలు శ్రీను, కళ్యాణ్, మోహన్, యూసుఫ్, రమ, రాజశ్రీ, సౌజన్య, సజన్‌లాల్, సంతోష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు