సమాన అవకాశాలే ప్రజాస్వామ్యానికి పునాది

26-11-2026 | 03:11pm

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 26 (విజయక్రాంతి): దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు (Equal Opportunities) లభిస్తున్నాయంటే అది భారత రాజ్యాంగం (Indian Constitution) కల్పించిన గొప్పతనమని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వమే దేశ ప్రజాస్వామ్యానికి (Democracy) పునాది అని పేర్కొన్నారు.

గురువారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో రాజ్యాంగ ప్రవేశికను చదివించి ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భారత ప్రజలకు అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుల సేవలు చిరస్మరణీయమని, వారంతా దేశానికి గర్వకారణమని అన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి ప్రాథమిక హక్కులను కల్పించిందని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకోవడంతో పాటు అందులో పేర్కొన్న విధులు, బాధ్యతలను ప్రతి పౌరుడు సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి అనూష, వివిధ శాఖల అధికారులు, ఐడీఓసీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు