పుట్టినరోజు వేడుకల్లో అనాథ వృద్ధులకు అన్నదానం

26-11-2026 | 03:38pm

గంభీరావుపేట, నవంబర్ 26 (విజయక్రాంతి): పుట్టినరోజు అంటే విందులు, వినోదాలు, హంగులు, ఆర్భాటాలు మాత్రమే కాదు.. నలుగురికి సాయపడుతూ ఆనందాన్ని పంచుకోవడమనే సందేశాన్ని చాటారు నర్మాల బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆకునూరి రాజేందర్. తన పుట్టినరోజు (Birthday Celebrations) సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని మా అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం (Food Donation) నిర్వహించి, పండ్లు పంపిణీ చేశారు. వారితో కొంతసేపు ఆప్యాయంగా ముచ్చటిస్తూ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు మల్లుగారి నర్సాగౌడ్ మాట్లాడుతూ.. పుట్టినరోజు వేడుకల పేరుతో విందులు, వినోదాలకు అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం కంటే ఆకలితో ఉన్న అనాథలు, వృద్ధుల కడుపు నింపడం గొప్ప విషయమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు (Social Service) సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఆకునూరి రాజేందర్ మాట్లాడుతూ.. పుట్టినరోజు సందర్భంగా అనవసర ఖర్చులు చేయకుండా ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేయడం, వారితో ఆప్యాయంగా కొంత సమయం గడపడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పుట్టినరోజులు, ఇతర శుభకార్యాల సందర్భంగా విందులు, వినోదాలకు చేసే ఖర్చులో కొంత భాగమైనా నిరుపేదలు, అనాథలు, వృద్ధుల సంక్షేమానికి కేటాయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నర్మాల మాజీ సర్పంచ్ ఎడబోయిన రాజు, నాయకులు ఎగదండీ స్వామి, పంపరి మహేష్, గుండెల్లి కళ్యాణ్, దాసరి చంద్రం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు