వెట్టిచాకిరి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి
- స్వేచ్ఛా రథం ప్రచార వాహనం ప్రారంభం
- జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్ జి
ములుగు, అక్టోబర్ 15 (విజయక్రాంతి): వెట్టిచాకిరి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్ జి(Additional Collector Ch. Mahender G.) అన్నారు. గురువారం ములుగు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కార్మిక శాఖ, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ సంస్థ సమన్వయంతో వెట్టిచాకిరి నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ‘స్వేచ్ఛా రథం’ ప్రచార వాహనాన్ని అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెట్టిచాకిరి, బలవంతపు శ్రమ నుంచి కార్మికులకు విముక్తి కల్పించేందుకు ప్రజల్లో అవగాహన పెంపొందించాలని పేర్కొన్నారు. కార్మికులు తమ హక్కులను తెలుసుకోవాలని, వారి రక్షణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఇటుక బట్టీలు, చేపలు, రొయ్యల పెంపక కేంద్రాలు, గనులు, రాతి క్వారీలు, వ్యవసాయ క్షేత్రాలు, ఇతర అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులకు ఈ ప్రచార వాహనం ద్వారా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. వెట్టిచాకిరి బాధితులు, అటువంటి పరిస్థితులను గుర్తించిన ప్రజలు టోల్ఫ్రీ నెంబరు 080-69434343ను సంప్రదించి సమాచారం అందించాలని కోరారు.
కార్మికులు ఎదుర్కొనే ఇబ్బందులు, వారి హక్కుల పరిరక్షణ ఆవశ్యకతను కళాకారులు నాటిక రూపంలో వివరించారు. అనంతరం వెట్టిచాకిరి నిర్మూలనపై అవగాహన పోస్టర్ను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. వెట్టిచాకిరి నిర్మూలనకు కృషి చేస్తామని అధికారులు, కలెక్టరేట్ సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారి వినోద, జిల్లా పౌర సంబంధాల అధికారి రఫిక్, కలెక్టరేట్ పరిపాలనాధికారి అల్లం రాజకుమార్, పర్యవేక్షకులు మంజుల, మహేష్ బాబు, కలెక్టరేట్ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.