ఆపదలో ఉన్న కుటుంబానికి ముప్పనపల్లి సహాయనిధి అండ
జాండిస్, లివర్ డ్యామేజ్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రఘుపతికి రూ.18 వేల ఆర్థిక సహాయం
కన్నాయిగూడెం, నవంబర్ 20(విజయక్రాంతి): మానవత్వంతో ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచింది ముప్పనపల్లి సహాయనిధి(Muppanapalli Relief Fund). ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామానికి చెందిన శ్రీరాముల రఘుపతి(Sriramula Raghupati) గత వారం రోజులుగా తీవ్ర జ్వరం, జాండిస్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో(Gandhi Hospital) చికిత్స పొందుతున్నాడు.
వైద్య పరీక్షల్లో లివర్ దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించడంతో మరింత మెరుగైన వైద్యం అవసరమని సూచించారు.ఇప్పటికే వారం రోజులుగా చికిత్స కొనసాగుతుండగా, మరో 15 రోజుల పాటు వైద్యం అవసరమని, ఇందుకు సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. రఘుపతి వృత్తిరీత్యా మంగలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన సంపాదనపైనే కుటుంబం ఆధారపడి ఉండటంతో ఇంతటి భారీ వైద్య ఖర్చులను భరించే ఆర్థిక స్థోమత లేక కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఈ విషయం తెలుసుకున్న ముప్పనపల్లి సహాయనిధి సభ్యులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి రఘుపతి కుటుంబానికి రూ.18 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా రఘుపతి భార్య దాతలు ముందుకొచ్చి తమ భర్త ప్రాణాలను కాపాడేందుకు ఆర్థిక సహాయం అందించాలని కన్నీటి పర్యంతమవుతూ వేడుకుంటున్నారు.ఆపదలో ఉన్న రఘుపతి కుటుంబాన్ని ఆదుకోవడానికి మరింత మంది దాతలు ముందుకు రావాలని గ్రామస్తులు కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో ముప్పనపల్లి సహాయనిధి సభ్యులు నామని రాజేష్, కంచె రమేష్,తిప్పనపల్లి విజయ్, శ్రీరాముల భరత్ తదితరులు పాల్గొన్నారు.