మత్తు దందాలో కందనూల్!

25-11-2026 | 05:35am

ఈగల్ టీం రంగంలోకి దిగితేనే బయటపడుతున్న మత్తు వ్యాపారం 

గంజాయి సాగు, విక్రయాలు, అల్పాజోలం తయారీ వరకూ..

స్థానిక పోలీసులు, ఎక్సైజ్ అధికారుల తీరు పట్ల సందేహాలు

నాగర్ కర్నూల్ / అచ్చంపేట, నవంబర్ 23 (విజయక్రాంతి): నల్లమల ప్రాంతంలో(Nallamala region) మత్తు పదార్థాల అక్రమ వ్యాపారం(Illegal trade in narcotic substances) ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నా స్థానిక, గ్రామీణ నిఘా వ్యవస్థ(Rural Surveillance System) పనితీరుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  గంజాయి సాగు నుంచి విక్రయాల వరకు, అల్పాజోలం తయారీ నుంచి సరఫరా వరకు అక్రమ దందా సాగుతున్నట్లు వరుస ఘటనలు బయట పడుతున్నాయి. మరి కొంత మంది నిందితులు హత్య కేసుల్లోనూ ఆల్ఫోజోలం అంగట్లో సరుకుగా వినియోగిస్తున్నట్లు బయటపడింది.

అయితే ఈగల్ టీం రంగంలోకి దిగి దాడులు నిర్వహించేంత వరకు స్థానిక పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందలేదా అన్న సందేహాలు అందరినీ కలవరపెడుతున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా ప్రాంతం అయినప్పటికీ అంతర్రాష్ట్ర ముఠాతో సంబంధాలు ఏర్పరచుకొని ఈ దందా వ్యవహారం నడిపిస్తున్న పట్టింపు లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.  అచ్చంపేటలోని ఓ ఇంటి ఆవరణలో గంజాయి సాగు చేస్తున్న విషయాన్ని కొద్దినెలల క్రితం ఎక్సైజ్ పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.

తాజాగా ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి 7.440 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోనూ లాడ్జిలో సుమారు 5కిలోల గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారు. తాజాగా అచ్చంపేటలో గంజాయి సేవిస్తున్న తొమ్మిది మందికి డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్ రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ ఘటనల్లో ఈగల్ టీం దాడుల తర్వాతే అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి రావడం స్థానిక నిఘా తీరుపై చర్చకు దారితీస్తోంది.

అల్పాజోలం తయారీతో మరో సంచలనం.!

బిజినపల్లి కేంద్రంగా రూ.38 లక్షల విలువైన అల్పాజోలం తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఈగల్ టీం పోలీసులు సంయుక్తంగా ఇటీవల పట్టుకున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సంబంధాలు కలిగిన ఈ ముఠా ఇక్కడ తయారు చేసిన అల్పాజోలం కల్తీ కల్లు కాంపౌండ్లకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. గతంలో అదే మండలంలో అల్ఫోజోలం తయారీ ముఠాను డిఆర్‌ఐ అధికారులు దాడి చేసి పట్టుకునేంత వరకూ స్థానిక పోలీసులు, స్థానిక అబ్కారీ అధికారులకు తెలియకపోవడం విశేషం. ఒకవైపు గంజాయి, మరోవైపు అల్పాజోలం దందా వెలుగు చూస్తుండటంతో మత్తు పదార్థాల అక్రమ వ్యాపారం ఏ స్థాయిలో విస్తరించిందన్న ఆందోళన నెలకొంది.

సమాచార వ్యవస్థ ఏం చేస్తోంది.?

గంజాయి సాగు చేస్తున్నా, గ్రామాలు, పట్టణాల్లో చిన్న చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్నా స్థానిక స్థాయిలో ముందస్తు సమాచారం ఎందుకు అందడం లేదన్నది అందరిలో తొలుస్తున్న ప్రశ్న. గ్రామ పోలీసింగ్ వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పటికీ రౌడీషీటర్ల కదలికలు, పాత నేరస్తులు, పోకిరీల పట్ల నిఘా వ్యవస్థ ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యువత మత్తుకు బానిసలవుతున్న విషయాన్ని గుర్తించడంలో నిఘా వ్యవస్థ ఎందుకు విఫలమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈగల్ టీం వచ్చి దాడులు చేసే వరకు స్థానిక పోలీసు, ఎక్సైజ్ యంత్రాంగం దృష్టికి ఈ వ్యవహారాలు ఎందుకు రావడం లేదన్న ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. కేవలం దాడులు, అరెస్టులతో సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభించదు. మత్తు పదార్థాల సరఫరా మూలాలను ఛేదించడం, స్థానికంగా విక్రయించే నెట్‌వర్క్‌ను గుర్తించడం, యువతకు అవగాహన కల్పించడం అవసరం. ముఖ్యంగా స్థానిక పోలీసు, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో నిరంతర నిఘా కొనసాగించాలి. నల్లమలలో మత్తు దందాకు అడ్డుకట్ట పడాలంటే ఇప్పటికైనా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మరిన్ని వార్తలు