తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన కుమార్తె

28-10-2026 | 09:02pm
  1. తండ్రి అంతిమయాత్రలో కన్నీటి దృశ్యం..
  2. నలుగురు ఆడబిడ్డలకు పెద్దదిక్కును కోల్పోయిన విషాదం

మునుగోడు, అక్టోబర్ 28 (విజయక్రాంతి): తండ్రి మరణంతో(Fathers Last Rites) ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న తండ్రిని కోల్పోయిన నలుగురు ఆడబిడ్డలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తండ్రి అంత్యక్రియల్లో పెద్ద కుమార్తె సాక్షి అంతిమ సంస్కారాలు నిర్వహించిన దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.

మునుగోడు మండలం కొంపెల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన గ్రామస్తులను కలచివేసింది. కొంపెల్లి గ్రామానికి చెందిన బోయపర్తి మహేందర్‌ (39) వారం రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన మహేందర్‌కు నలుగురు ఆడపిల్లలు. కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆయన ఆకస్మిక మరణంతో భార్య రోజా, నలుగురు కుమార్తెలు పెద్దదిక్కును కోల్పోయారు.

బుధవారం నిర్వహించిన అంత్యక్రియల్లో పెద్ద కుమార్తె సాక్షి తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. తండ్రిని కోల్పోయిన చిన్నారులు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల భవిష్యత్తుకు అండగా నిలిచిన వ్యక్తి దూరం కావడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

మహేందర్‌ మృతి విషయం తెలుసుకున్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి , ఆదిత్య ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీరమల్ల సురేష్‌గౌడ్‌ బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం పంపించారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మండుల సత్యం మహేందర్‌ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కుటుంబ పెద్దను కోల్పోయిన రోజా, ఆమె నలుగురు ఆడబిడ్డలకు సమాజం అండగా నిలవాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఈ కుటుంబానికి దాతలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. చిన్నారుల చదువుకు, భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.

మరిన్ని వార్తలు