వైటీపీఎస్‌లో చారిత్రాత్మక ఘట్టం

22-10-2026 | 05:20am

5వ యూనిట్ పవర్ గ్రిడ్‌కు అనుసంధానం

దామరచర/హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం(Yadadri Thermal Power Plant) నిర్మాణంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ఈ ప్లాంట్ లోని 5వ యూనిట్ ట్రయల్ రన్ విజయవంతమైంది.

టీజీ జెన్‌కో అధికారులు బుధవారం ఐదో యూనిట్‌ను పవర్ గ్రిడ్తో విజయవంతంగా అనుసంధానం (సింక్రనైజేషన్) చేశారు.యాదాద్రి ప్లాంట్ మొత్తం 4 వేల మెగావాట్ల (5 X 800 ఎండబ్ల్యూ) విద్యుత్ ఉత్పత్తికి గాను నిర్మితమవుతోంది. ఇప్పటికే 1, 2, 3, 4 యూనిట్ల వాణిజ్యపరమైన విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాగా, ఇప్పుడు చివరిదైన 5వ యూనిట్ ట్రయల్ రన్ కూడా సక్సెస్ కావడంతో ప్లాంట్ పూర్తి స్థాయి లక్ష్యానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్న తరుణంలో వైటీపీఎస్ కీలక పాత్ర పోషిస్తోంది.

ఇటీవల కరెంట్ డిమాండ్ పెరిగిన సమయంలోనూ ఈ ప్లాంట్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున విద్యుత్ను అందించి అండగా నిలిచింది.వచ్చే నెల నుండి పూర్తి స్థాయి ఉత్పత్తిని సాదించేందుకు ప్లాంట్ పనులు శరవేగంగా సాగుతుండగా, వచ్చే నెల నాటికి ఈ ఐదో యూనిట్ నుండి కూడా పూర్తి స్థాయిలో వాణిజ్య విద్యుత్ ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.

ఈ ప్లాంట్కు నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేసేందుకు మహానది కోల్‌ఫీల్డ్స్‌తో  తుది ఒప్పంద ప్రక్రియ కూడా నడుస్తోంది.ఈ విజయవంతమైన ట్రయల్ రన్తో తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో మరింత స్వయంసమృద్ధి సాధించనుంది. 

మరిన్ని వార్తలు